
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌పై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు పవన్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో జనసేనకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నుంచి స్పందన వచ్చింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు రాజేంద్రమహేంద్రవరంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... వాలంటీర్ వ్యవస్థ రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసిందని విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్నవారికి అనుకూలంగా పనిచేయించుకునేందుకు ఏర్పాటు చేశారని ఆరోపించారు.
వాలంటీర్ వ్యవస్థ రాజకీయ దృక్కోణంతో ఏర్పాటు చేసిన వ్యవస్థ అని విమర్శించారు. ఈ వ్యవస్థ ఏర్పాటు రాజ్యాంగబద్ధమైన అంశం కాదని అన్నారు. వాలంటీర్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ధనంతో ఈ వ్యవస్థను నడుపుతున్నారని.. తాను అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించానని చెప్పారు. వాలంటీర్ల వ్వవస్థపై ఎంత ఖర్చు అవుతుందని కౌన్సిల్‌లో ప్రశ్నించడం జరిగిందని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీకి.. వాలంటీర్ల వ్యవస్థ మీద ఇంత ఖర్చు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు.
100 మందికి ఒక వ్యక్తిని పెడితే వాళ్ల దగ్గర ఏ సమాచారం అయినా ఉంటుందని.. అది చాలా ప్రమాదకరమని అన్నారు. భారతదేశంలో ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ హేతుబద్దమైన నిర్ణయం కాదనేది బీజేపీ అభిప్రాయమని సోము వీర్రాజు స్పష్టం చేశారు.