గుంటూరు ఘటన సభ నిర్వాహకుల వైఫల్యమే.. ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదు: సోము వీర్రాజు

Published : Jan 02, 2023, 12:13 PM IST
గుంటూరు ఘటన సభ నిర్వాహకుల వైఫల్యమే.. ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదు: సోము వీర్రాజు

సారాంశం

గుంటూరులో ఆదివారం జరిగిన చంద్రన్న సంక్రాంతి కానుక కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. ఈ ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు స్పందించారు.   

గుంటూరులో ఆదివారం జరిగిన చంద్రన్న సంక్రాంతి కానుక కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు స్పందించారు. గుంటూరులో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. కందుకూరు ఘటన మరవకముందే గుంటూరు ఘటన చోటుచేసుకోవడం బాధకరమని అన్నారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  

అధికారమే పరమావధిగా భావించడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. గుంటూరు ఘటనకు నిర్వాహకుల వైఫల్యమే కారణమని ఆరోపించారు. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారు. ఇలాంటి దుర్ఘటనలు రాబోయే రోజుల్లో జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 

అసలేం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు సభలో ప్రసంగించి అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే.. తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఒక్కరు ఘటన స్థలంలో మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పలువురు గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నాయుడు బుధవారం ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. 

అయితే సభ వద్ద అందించే ఉచిత రేషన్‌ కిట్‌లను స్వీకరించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఉచిత రేషన్‌ కిట్‌లను అందుకునేందుకు ప్రజలు ఒకరితో ఒకరు తోపులాటకు దిగడంతో తొక్కిసలాట జరిగింది. టీడీపీ కార్యకర్తలు, వాలంటీర్లు జనాన్ని అదుపు చేయలేకపోయారు. తొక్కిసలాటను గమనించిన టీడీపీ నేతలు వెంటనే కిట్ల పంపిణీని నిలిపివేశారు. జారీ చేసిన కూపన్లందరికీ కిట్‌లను డోర్ డెలివరీ చేస్తామని వారు ప్రకటించారు.

ఆదివారం ఘటన చోటుచేసుకున్న వెంటనే.. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ప్రాంగణాన్ని పరిశీలించి తొక్కిసలాటకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. మహిళలు ఒక్కసారిగా మొదటి కౌంటర్ వద్దకు దూసుకెళ్లినప్పుడు.. క్యూ లైన్ల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు వారిపై పడ్డాయని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. ఇది మిగిలిన మహిళల్లో మరింత భయాందోళనలకు దారితీసిందని తెలిపారు. అయితే భారీ భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ తొక్కిసలాట జరిగిందని ఎస్పీ స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Visakha Utsav Curtain Raiser Event: హోం మంత్రి అనిత సెటైర్లు | Asianet News Telugu