
‘బొంకరా బొంకరా అంటే మా ఊరి మిరియాలు తాటికాయలంత’ అన్నాట్ట వెనకటికొకడు. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాటలు అలాగే అనిపిస్తున్నాయ్. నంద్యాల ఉపఎన్నిక ఫలితం టిడిపి పాలనపై రెఫరెండమట. అలాగని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.
మంత్రి చెప్పిన మాటలతో టిడిపి నేతలపై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. మూడేళ్ళ పాలనపై నంద్యాల ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నట్లు ప్రచారం సందర్భంగా మంత్రి చెప్పటంతో పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. పదేళ్ళ కాంగ్రెస్ పాలనకన్నా మూడేళ్ల టిడిపి పాలనలో నంద్యాలలో అభివృద్ధి బాగా జరిగిందని చెప్పటంతో టిడిపి నేతలే నోరెళ్లబెట్టారు.
గడచిన మూడేళ్ళలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధీ జరగలేదన్న సంగతి అందరకీ తెలుసు. తమ నియోజకవర్గంలో ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధిపనులు చేయటం లేదని వైసీపీలో ఉన్నపుడు భూమానాగిరెడ్డే ఎన్నోసార్లు చెప్పారు. సరే రెండేళ్ళ తర్వాత హటాత్తుగా టిడిపిలోకి ఫిరాయించారు లేండి.
అభివృద్ధిపనులు చేయించుకోవటం కోసమే తాను టిడిపిలోకి ఫిరాయించినట్లు భూమా ఎన్నోమార్లు చెప్పారు. అంటే మొదటి రెండేళ్ళు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అర్ధమవుతోంది. ఫిరాయించిన ఏడాది తర్వాత కూడా కేవలం ప్రతిపాదనలకే అభివృద్ధి పరిమితమైందని కూడా భూమా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతీ అందరికీ తెలిసిందే.
ఎప్పుడైతే భూమా మరణించారో, ఎప్పుడైతే ఉపఎన్నిక అనివార్యమైందో అప్పటి నుండే చంద్రబాబు నంద్యాలపై దృష్టి పెట్టారన్నది వాస్తవం. అంటే సుమారు నెల రోజుల నుండి మాత్రమే అభివృద్ధి పనులు మొదలయ్యాయి. వాస్తవాలిలా వుండగా మంత్రి సోమిరెడ్డి మాత్రం మూడేళ్ళల్లో నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిపోయిందని డప్పు వాయించటం విచిత్రం. సరే, సోమిరెడ్డి ఎంత చెప్పినా నిజాలేమిటో అందరికీ తెలుసు కదా? ఎందుకంటే, టిడిపి అభ్యర్ధి ప్రచారానికి వెళ్ళిన చాలా చోట్ల ‘అసలు ఓట్లెందుకెయ్యాలో చెప్పాలం’టూ నిలదీస్తున్న సంగతి అందరూ చూస్తున్నదే.
ఇటువంటి నేపధ్యంలో ఏదో ప్రచారానికి వెళ్లామో వచ్చామా అన్నట్లుండకుండా నంద్యాల ఫలితం తమ పాలనకు రెఫరెండం అని చెప్పటమేమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు? భూమా బ్రహ్మానందరెడ్డికి భారీ మెజారిటీ ఖాయమట. అది నిజమే అయితే అంతమంది మంత్రులు ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు? ఇతర పార్టీల నేతలను టిడిపిలోకి లాక్కోవటానికి ఎందుకు ఒత్తిళ్ళు పెడుతున్నారు? వైసీపీ నేతల ఇళ్ళపై పోలీసులతో అర్ధరాత్రుళ్ళు ఎందుకు దాడులు చేయిస్తున్నట్లు? హటాత్తుగా కోట్ల రూపాయల మేర ఓటర్లకు తాయిలాలు ఎందుకు పంచుతున్నట్లు ? వీటికి సోమిరెడ్డి సమాధానాలు చెబితే చాలు.