అంతా జగన్ వ్యాఖ్యల వల్లే...: ఏపీలో కరోనా వ్యాప్తిపై సోమిరెడ్డి

By telugu teamFirst Published Jul 22, 2020, 2:04 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ వ్యాఖ్యల వల్ల ప్రజలు కరోనాను తేలిగ్గా తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

అమరావతి: కరోనా వ్యాధిని ఏపీ ప్రభుత్వం మొదట నుంచి తేలికగా తీసుకుందని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు అది మరింత ప్రమాదకరంగా మారి ఆస్పత్రుల్లో బెడ్లు లేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న జ్వరం...వస్తుంది..పోతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి  మాట్లాడటం తగదని నేను మొదట్లోనే చెప్పానని ఆయన గుర్తు చేశారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో వ్యాధికి గురైన వారు కానీ, మిగిలిన వారు కానీ జాగ్రత్తలు తీసుకోవడంలో తేలికగా తీసుకున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిందని అన్నారు.

"నిత్యం వేలాది కేసులు నమోదవుతుండటంతో దేశంలోనే ఏపీ 5వ స్థానానికి చేరింది. గత వారం రోజులుగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. సగటున రోజూ 50 మరణాలు సంభవించేలా పరిస్థితులు నెలకొన్నాయి. గంటకు రెండు మరణాలు చొప్పున నమోదవుతున్నాయి. ఇది తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో 5 రెట్లు ఎక్కువ" ఆయన అన్నారు.

"ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆస్పత్రులు, వాటిలోని వసతులపై నమ్మకం లేక ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాదులో, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య  చెన్నైలో కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరారు. ముఖ్య నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే రాష్ట్రాన్ని వదిలి పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నారంటే ఏపీలో పరిస్థితి అర్ధమవుతుంది" అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు..

"కరోనా నివారణలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం కీలకం. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రూ.250 కేటాయించినా కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్న ఆహారంలో నాణ్యతపై పలు చోట్ల బాధితులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రధానంగా వెంటిలేటర్లు, ఆక్సిజన్ వంటి ఎక్విప్ మెంట్ సమకూర్చడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ విఫలమయ్యాయి" అని ఆయన అన్నారు.

"కేంద్ర ప్రభుత్వం 8 వేల కోట్లు ఇచ్చామని చెబుతోంది. ఈ మొత్తం ఎక్కడ ఖర్చు పెట్టారని ప్రజల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కారణంగా ప్రజలు ఆకలితో అలమటించే రోజులొచ్చాయి. ఇలాంటి సమయంలో మేం కాకపోతే పథకాలు పెడుతున్నామని ప్రభుత్వం ప్రచారాలు చేసుకుంటూ గడిపేస్తోంది. కరోనా కారణంగా ప్రజలు కఠోరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. చేద్దామన్నా పనులు లేవు...ఆహార కొరత కూడా ఏర్పడే ప్రమాదం నెలకొంది. ఇలాంటి సమయంలో కేంద్రం ఇచ్చిన నిధులకు రెండింతలు సమకూర్చి ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది" అని సోమిరెడ్డి అన్నారు.

"ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి యుద్ధప్రాతిపదికన ఆస్పత్రుల్లో అవసరమైన పరికరాలను సమకూర్చాలి. కరోనాపై పోరాటం సాగిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కి  అండగా నిలవాలి" అని ఆయన సూచించారు.

click me!