
కదులుతున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ లోని ఓ బోగీలో ఒక్క సారిగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులందరూ ఆందోళన చెందారు. ఈ ఘటన తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలులో చోటు చేసుకుంది. అయితే ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి. వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీస్ ఎప్పటిలాగే తిరుపతి నుంచి సికింద్రబాద్ కు బుధవారం బయలుదేరింది. సాయంత్రం ఆ ట్రైన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మునబోలు సమీపంలోకి చేరుకుంది. అయితే అందులోని ఓ బోగీలో ఒక్క సారిగా స్వల్పంగా మంటలు చెలరేగింది. తరువాత అది ఆరిపోయి దట్టమైన పొగ వచ్చింది. ఇది ఆ బోగీ మొత్తం వ్యాపించింది. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే లోక్ పైలట్ కు విషయం చెప్పారు. దీంతో ఆయన రైలును నిలిపివేసేందుకు సడెన్ బ్రేకులు అప్లయ్ చేశారు.
రైలు ఒక్క సారిగా ఆగిపోయింది. అయినా మరో సారి పొగ చెలరేగింది. ఈ పరిణామాలపై ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అసలేం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు రైలు కూడా దిగారు. అయితే ఈ పొగకు కారణం ఎవరో టాయిలెట్ లో సిగరెట్ తాగి పడేయటమే అని సిబ్బంది తరువాత కనుగొన్నారు. తరువాత పొగలు తగ్గిపోవడంతో రైలు తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది. అయితే సిగరెట్ పడేసినట్టుగా అనుమానిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.