పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఆరేళ్ల బాలుడు.. అసలు ఎందుకోసం వెళ్లాడంటే..

Published : Mar 20, 2022, 09:49 AM IST
పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఆరేళ్ల బాలుడు.. అసలు ఎందుకోసం వెళ్లాడంటే..

సారాంశం

యూకేజీ చదువుతున్న ఆరేళ్ల బాలుడు పోలీసు స్టేషన్‌ మెట్లు ఎక్కాడు. తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బుడతడు.. నేరుగా సీఐ వద్దకు వెళ్లి తన సమస్యను వివరించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకుంది. 

యూకేజీ చదువుతున్న ఆరేళ్ల బాలుడు పోలీసు స్టేషన్‌ మెట్లు ఎక్కాడు. అతని పాఠశాల వద్ద ట్రాఫిక్ సమస్యను తీర్చాలని పోలీసులను కోరాడు. తమ పాఠశాల వద్ద జేసీబీ, ఇతర వాహనాలను అడ్డుగా నిలపడంతో స్కూల్‌ బస్సులు ఆపాలన్నా, బడికి వెళ్లాలన్నా ఇబ్బందులు పడుతున్నట్టుగా బాలుడు పోలీసులకు చెప్పాడు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితమే ఈ ఘటన జరిగినప్పటికీ.. బాలుడు పోలీసులతో మాట్లాడిన వీడియో వైరల్‌ కావడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

వివరాలు.. పలమనేరు పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో ఆరేళ్ల కార్తీకేయ యూకేజీ చదువుతున్నాడు. అయితే అతడు పాఠశాల వద్ద నిత్యం ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోవడం గమనించాడు. ఈ సమస్య తీరాలంటే ఏం చేయాలని కార్తీకేయ తన తండ్రిని అడిగాడు. అందుకు కార్తీకేయ తండ్రి పోలీసులకు చెప్పాలని సమాధానం ఇచ్చాడు. దీంతో కార్తీకేయ కోరడంతో అతడి తండ్రి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీసు స్టేషన్‌కు చేరుకున్న కార్తీకేయ.. లోనికి వెళ్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌ ట్రాఫిక్ సమస్య గురించి చెప్పాడు. 

పాఠశాల ప్రాంతంలో రోడ్లు తవ్వారని కార్తీకేయ.. సీఐకు చెప్పాడు. ఆ ప్రాంతంలో రోజు ట్రాఫిక్ జామ్ అవుతుందని వివరించాడు. విద్యార్థులు తమ పాఠశాలకు చేరుకోవడానికి ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నారని తెలిపాడు. సీఐ వచ్చి సమస్యను పరిష్కరించాలని కోరాడు. కానిస్టేబుల్‌ను పంపుతామని సీఐ చెప్పగా.. వద్దు సార్‌ మీరే రావాలని పట్టుబట్టాడు. ఇక, కార్తీకేయ ధైర్యాన్ని మెచ్చిన సీఐ.. అతనికి స్వీటు తినిపించి అభినందించాడు. ఇక, అనంతరం ఓ కానిస్టేబుల్‌ను బాలుడు చదువుతున్న పాఠశాల ప్రాంతంలో ట్రాఫిక్ విధుల్లో ఉంచారు.  

‘బాలుడు చదువుతున్న పాఠశాల ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే జంక్షన్. అక్కడ డ్రైనేజ్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆరేళ్ల బాలుడు తన తండ్రితో పాటు ఎలాంటి భయం లేకుండా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ట్రాఫిక్ కష్టాలపై ఫిర్యాదు చేయడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీలైనంత త్వరగా ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం’అని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Minister Gottipati Ravi Kumar: వైసీపీ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ | Asianet News Telugu