ఒకే రంగు డ్రస్ వేసుకొని అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

By ramya neerukondaFirst Published Oct 9, 2018, 11:08 AM IST
Highlights

ప్రిపరేషన్‌ సెలవుల పేరుతో పది రోజులుగా ఇంటి వద్దే చదువుకుంటున్నారు. తండ్రి పట్నం అజంతుల్లా ఉపాధి కోసం కువైట్‌లో వున్నాడు.

ఒకే రంగు డ్రస్ వేసుకొని.. ఒకే చీరకు ఉరివేసుకొని ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కలికిరిలో కలకలం సృష్టించింది. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య తో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అక్కా చెల్లెళ్ళు తస్లీమా (19), షికాబీ (18) మదనపల్లె హార్సిలీహిల్స్‌ నర్సింగ్‌ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు చదువుతున్నారు. అక్క తస్లీమా మూడో సంవత్సరం, చెల్లెలు షికాబీ రెండో సంవత్సరం చదువుతూ అక్కడే ప్రభుత్వ వసతి గృహంలో వున్నారు. ప్రిపరేషన్‌ సెలవుల పేరుతో పది రోజులుగా ఇంటి వద్దే చదువుకుంటున్నారు. తండ్రి పట్నం అజంతుల్లా ఉపాధి కోసం కువైట్‌లో వున్నాడు. తల్లి అలీమాబీ ఇంట్లోనే ఉంటోంది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంట్లోకొచ్చిన తల్లి అలీమాబీ కూతుళ్ళిద్దరూ ఉరేసుకుని ఉండడం చూసి కేకలు వేసింది.

విషయం తెలుసుకున్న సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమశేఖర్‌ రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంటి పై కప్పుకున్న మోల్డింగ్‌ రాడ్‌కు చీర చుట్టేసి ఇద్దరూ అదే చీరతో మెడకు బిగించుకున్నారు. ఇరువురూ నిచ్చెన పైకి ఎక్కి ఒకే చీరకు ఉరేసుకుని నిచ్చెన మీద నుండి దూకేసినట్లు సంఘటన స్థలంలోని ఆనవాళ్ళను బట్టి తెలుస్తోంది. 

ముందస్తు ఆలోచనతోనే గదిలోకి నిచ్చెన కూడా తెచ్చుకుని సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటి మొదటి అంతస్తులోని గదిలో ఈ సంఘటన జరిగింది. అయితే పై గదిలోకి ఏ మాత్రం వీలుగాని ఇరుకు దారి నుంచి నిచ్చెన ఎలా చేర్చగలిగారన్నదానిపై పోలీసులు దృష్టిపెట్టారు. కానీ ఇంటి ముందు వైపు రోడ్డు మీద నుంచి నిచ్చెన మొదటి అంతస్తుకు చేర్చే అవకాశమున్న విషయాన్ని కూడా గమనించారు. పరీక్షల నిమిత్తం మృతదేహాలను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

వారి ఆత్మహత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇద్దరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారంటే.. ఇద్దరికీ ఒకే సమస్య ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!