సింహాచలంలో మరో వివాదం.. సోషల్ మీడియాలో స్వామి వారి నిజరూప దర్శనం వీడియోలు, విచారణకు ఆదేశం

By Siva KodatiFirst Published Apr 25, 2023, 4:16 PM IST
Highlights

సింహాచలం వరహా లక్ష్మీ నరసింహా స్వామి వారి దేవస్థానంలో చందనోత్సవ కార్యక్రమంలో మరో అపచారం జరిగింది. స్వామి వారి నిజరూప దర్శనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టారు. 

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాచలం వరహా లక్ష్మీ నరసింహా స్వామి వారి దేవస్థానంలో చందనోత్సవ కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తొలి రోజు నుంచే ఈ కార్యక్రమం వివాదాస్పదమైంది. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో విపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. తాజాగా ఆలయంలో అపచారం జరిగింది. స్వామి వారి నిజరూప దర్శనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సింహాచలం ఆలయంలో కెమెరాలు, సెల్‌ఫోన్లతో వీడియోలు, ఫోటోలు తీయడం నిషేధం. అయినప్పటికీ లోపలికి ఫోన్‌తో ఎవరు వచ్చారు.. వీడియో ఎందుకు తీశారు అనే దానిపై ఆలయ అధికారులు విచారణకు ఆదేశించారు. గతంలోనూ సింహాచలం ఆలయ అంతరాలయాన్ని కొందరు ఆకతాయిలు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. 

అంతకుముందు భక్తులకు సౌకర్యాలు కల్పించకపోవడంపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పందించారు. సింహాచలం చందనోత్సవంలో భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులు బాధ కలిగించాయన్నారు. ప్రభుత నిర్లక్ష్యంగా కారణంగానే భక్తులు అవస్థలు పడ్డారని.. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో దశాబ్ధాలుగా లేని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. దేవస్థానాలను వివాదాలకు కేంద్రంగా మారుస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Videos

ALso Read: ఆచారాలను మంటగలిపారు: అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై స్వరూపానందేంద్ర ఫైర్

ఇకపోతే.. స్వరూపానందేంద్ర స్వామిజీ మాట్లాడుతూ.. సామాన్య  భక్తులను దేవుడికి దూరం చేసేలా  వ్యవహరించారని ఆయన  అధికారులపై  మండిపడ్డారు. గుంపులుగా పోలీసులను పెట్టారని.. కానీ  ఏర్పాట్లు  సరిగా లేవన్నారు. తన   జీవితంలో  తొలిసారి  ఇలాంటి చందనోత్సవానికి హాజరయ్యానని  చెప్పారు. ఎందుకు  దర్శనానికి  వచ్చానా  అని బాధపడుతున్నానన్నారు. కొండ కింద నుండి పైవరకు  రద్దీ  ఉందని.. కానీ   భక్తులకు జవాబు చెప్పేవారు లేరని స్వామిజీ అన్నారు. తన  జీవితంలో  ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితిని   చూడలేదని  స్వరూపానందరేంద్ర  చెప్పారు.  భక్తుల ఆర్తనాదాలు వింటూంటే  కన్నీళ్లు వస్తున్నాయన్నారు.  
 

click me!