కొండపై అక్రమాలు, క్వారీయింగ్‌కు అడ్డుచెప్పని వైనం: సింహాచలం ఈవోపై వేటు

Siva Kodati |  
Published : Jun 07, 2020, 03:22 PM IST
కొండపై అక్రమాలు, క్వారీయింగ్‌కు అడ్డుచెప్పని వైనం: సింహాచలం ఈవోపై వేటు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ దేవాలయం సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఈవోగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావుపై బదిలీ వేటు పడింది. 

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ దేవాలయం సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఈవోగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావుపై బదిలీ వేటు పడింది. ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ దేవాదాయ శాఖ ఎస్టేట్ ఆజాద్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా ఈవో వెంకటేశ్వరరావుపై బదిలీ వేటు పడింది.

సింహాచలం ఈవోగా రాజమండ్రి ఆర్జేసీ భ్రమరాంభను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింహాచలం భూముల అక్రమణలు, అలాగే కొండపై జరుగుతున్న క్వారీయింగ్‌పై ఆజాద్ రెండు నివేదికలు సమర్పించారు. అందులో ఈవో అక్రమాలతో పాటు ఆయన నిర్లక్ష్యం వల్ల జరిగే తప్పిదాలను స్పష్టంగా వివరించారు.

సింహాచలం కొండపైనా, భూముల్లోనూ అక్రమ నిర్మాణాల జాబితాను తన నివేదికలో పొందుపరిచారు ఎస్టేట్ ఆఫీసర్. అలాగే నిబంధనలకు విరుద్ధంగా సింహాచలం మెట్ల దారిలో ఉండే 12 దుకాణాలకు అనుమతులు ఇచ్చారని, వీటిని వేలం వేయకుండా ఈవో కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు నివేదికలో స్పష్టం చేశారు.

సింహాచలం కొండపై జరుగుతున్న మరిన్ని అక్రమాల్లో ఈవో వెంకటేశ్వరరావు పాత్రపై మరో నివేదికను కమీషనర్‌కు అందజేశారు ఆజాద్. దేవాలయాల్లో ప్రస్తుతం ఎలాంటి నిర్మాణాలు జరపొద్దని స్పష్టంగా చెప్పినా, ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈవో టెండర్లు పిలిచారని నివేదికలో పేర్కొన్నారు.

అలాగే కొండపై మూడు ప్రాంతాల్లో భారీ స్థాయిలో క్వారీయింగ్ జరుగుతోందని , పెద్ద ఎత్తున గ్రావెల్‌ను తరలిస్తున్నారని.. ఆధారాలతో సహా నివేదికను కమీషనర్‌కు అందజేశారు. అక్రమ క్వారీయింగ్‌ను అడ్డుకోకపోవడం వల్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం వుందని విచారణ కమీటీ హెచ్చరించింది.

సింహాచలం ఈవో వెంకటేశ్వరరావు తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు గాను అక్రమ రికార్డులను కూడా సృష్టించే ప్రయత్నం చేశారని స్పష్టంగా నివేదికలో పేర్కొన్నారు. ఇవన్నీ దేవాదాయ శాఖ కమీషనర్‌తో పాటు ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా వెళ్లడంతో ఈవో వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: ఫోన్లోనే అధికారులకి చెమటలు పట్టించిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet
Ayyanna Patrudu Speech: అయ్యన్న పాత్రుడు స్పీచ్ కి సభ మొత్తం నవ్వులే నవ్వులు| Asianet News Telugu