
తిరుపతి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి (ambedkar jayanthi) సందర్భంగా ఏర్పాటుచేసిన క్రీడాపోటీలో పాల్గొన్న పోలీస్ అధికారి మృతిచెందిన విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. యువకుతలతో కలిసి కబడ్డీ ఆడుతుండగా కూతకు వెళ్లిన సబ్ ఇన్స్పెక్టర్ (SI) Death) గుండెపోటుకు గురయి మృతిచెందాడు.
ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిరుపతి పడమర పోలీస్ స్టేషన్లో సబ్రహ్మణ్యం(57) ఎస్సై గా పనిచేస్తున్నాడు. ఇతడు కుటుంబంతో కలిసి తిరుపతి గ్రామీణ మండలం మల్లంగుంట పంచాయితీ అంబేద్కర్ కాలనీలో నివాసముంటున్నాడు. కాలనీవాసులతో కలిసిమెలిసి వుండే సుబ్రహ్మణ్యం అన్ని కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. ఇలా నిన్న (గురువారం) కూడా కాలనీలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు కూడా ఘనంగా జరగడంతో అందులో సుబ్రహ్మణ్యం పాల్గొన్నాడు.
అయితే స్వతహాగా మంచి క్రీడాకారుడైన సుబ్రహ్మణ్యం కాలనీ యువకులతో కలిసి కబడ్డి ఆడాడు. ఈ క్రమంలోనే కూతకు వెళ్లిన అతడు గుండెపోటుకు గురవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడికి తిరుపతి పట్టణంలోని రుయా హాస్పిటల్ కు తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఇలా ఎస్సై సుబ్రహ్మణ్యం మృతితో అతడి కుటుంబంలోనే కాదు నివాసముండే కాలనీ, తిరుపతి పోలీస్ విభాగంలో విషాదం నెలకొంది.
సుబ్రహ్మణ్యం 1984లో కానిస్టేబుల్ గా పోలీస్ శాఖలో చేరి ఎలాంటి రిమార్క్ లేకుండా విధులను నిర్వహించాడు. దీంతో 2019లో ఎస్సైగా ప్రమోషన్ పొందాడు. ఇంకా రెండుమూడేళ్లు సర్వీస్ వుండగా ఇలా హటాత్తుగా గుండెపోటుకు గురయి ప్రాణాలు కోల్పోయాడు. ఇతడికి భార్య, ఇద్దరు కొడుకులు వున్నారు.