శ్రీశైలం డ్యామ్ పన్నెండో గేటు వద్ద ఇవాళ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది.దీంతో మంటలు వ్యాపించాయి.
కర్నూల్:శ్రీశైలం డ్యామ్ పన్నెండో గేటు వద్ద సోమవారంనాడు సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
శ్రీశైలం పన్నెండో గేట్ వద్ద ఉన్న ఛేంజ్ ఓవర్ స్విచ్ బోర్డులో మంటలు వ్యాపించాయి. వర్షం పడే సమయంలో స్విచ్ ఆన్ చేయడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. మంటలు చెలరేగడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆందోళన చెందారు. వెంటనే విద్యుత్ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. ఆ తర్వాత మరమ్మత్తులు నిర్వహించి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
2020 ఆగస్టు మాసంలో తెలంగాణ రాష్ట్రం పరిధిలోకి వచ్చే శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా 9 మంది విద్యుత్ సిబ్బంది మృతి చెందారు. ఈ ప్రమాదం సమయంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నుండి తప్పించుకొనేందుకు విద్యుత్ సిబ్బంది ప్రయత్నించారు. ఈ ప్రమాదం కారణంగా వ్యాపించిన మంటలను అధికారులు అతి కష్టం మీద ఆర్పివేశారు.ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మంత్రి జగదీష్ రెడ్డి , సీఎండీ ప్రభాకర్ రావు తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించిన విషయం తెలిసిందే.