గుంటూరు నుంచి నిన్న సాయంత్రం బయలుదేరిన రఘురామకృష్ణమ రాజు రాత్రి 11 గంటల ప్రాంతంలో సికింద్రాబాదులోని ఆర్మీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: తనను చంపేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ఆరోపించారు. తన నియోజకవర్గంలోని అభిమానులను, కార్యకర్తలను కూడా వేధిస్తున్నారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనను సిఐడి అధికారులు సోమవారం రాత్రి సికింద్రాబాదులోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ఉన్న మీడియాకు తన కాలికి అయిన గాయాలను చూపించి మాట్లాడారు. సోమవారం సాయంత్రం గుంటూరు నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన ఆయన రాత్రి 11 గంటల సమయంలో సికింద్రాబాదు తిర్మలగిరిలోని ఆర్మీ ఆస్పత్రికి చేరుకున్నారు.
వాహనం నుంచి దిగిన ఆయనను అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక అంబులెన్సులో ఆస్పత్రిలోకి తీసుకుని వెళ్లారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఆయనకు వైద్య పరీక్షలు చేస్తారు. రఘురామ కృష్ణమ రాజు రాకకు ముందు తెలంగాణ హైకోర్టు ప్రతినిధులు ఆస్పత్రికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు.
రఘురామ కృష్ణమ రాజును కలిసేందుకు భార్య రమాదేవి, కుమారుడు భరత్, కూతురు ఇందు వచ్చారు. ఆస్పత్రిలో రఘురామ కృష్ణమ రాజు చేరికకు సంబంధించిన పత్రాలపై వారు సంతకాలు చేశారు తనను బాగా కొట్టారని, నడవడానికి కూడా ఇబ్బంది అవుతోందని ఆయన కుటుంబ సభ్యులతో చెప్పారు.