విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బర్రి రమేష్ కుమార్ హత్య కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. భార్య శివాని రమేష్ కు మటన్ పెట్టి, మద్యం తాగించి, ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ వీడియో తీసింది.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వన్ టౌన్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ కుమార్ హత్య కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రియుడు రామారావు, నీలాలతో కలిసి శివజ్యోతి అలియాస్ శివానీ తన భర్త రమేష్ ను మంగళవారం రాత్రి హత్య చేసిన విషయం తెలిసిందే. దిండుతో అదిమిపట్ట ఊపిరాడకుండా చేసి భర్తను చంపేసి గుండెపోటుతో మరణించినట్లుగా డ్రామా ఆడింది.
తన మీద అనుమానం రాకుండా శివానీ భర్తతో అన్యోన్యంగా ఉన్నట్లు, తాను భర్తను ఎంతగానో ప్రేమిస్తున్నట్లు నటించిన తీసిన వీడియోనే ఆమెపై అనుమానం పెంచింది. మంగళవారం రాత్రి భర్త రమేష్ కు మటన్ పెట్టి, మద్యం తాగించింది. నా భార్య చాలా మంచిదని, ధైర్యవంతరాలని, మై లైఫ్... మై లైప్ అంటూ భర్తతో చెప్పించి రికార్డు చేసింది. మద్యం మత్తులో ఊగుతున్న రమేష్ ను మంచంపై పడుకోబెట్టింది. దీన్ని కూడా రికార్డు చేసింది. ఆ వీడియో వైరల్ అయింది. తనపై అనుమానం రాకుండా ఆ వీడియో తీసింది. దాన్నే పోలీసులకు చూపించింది. దాంతోనే పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది. పోలీసుల విచారణలో దొరికిపోయింది.
తన పెద్దమ్మ కూతురు పైడమ్మ ద్వారానే టాక్సీ డ్రైవర్ రామారావు పరిచయం అయినట్లు పోలీసుల విచారణలో శివానీ చెప్పినట్లు తెలుస్తోంది. తద్వారా ఈ హత్యతో పైడమ్మకు కూడా సంబంధం ఉన్నట్లు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. రామారావుతో ఏడాదిన్నరగా శవానీ రాసలీలలు కొనసాగిస్తోంది. రమేష్ ను హత్య చేసేందుకు నీలాకు సుపారీ ఇచ్చారు. రమేష్ హత్య కేసుతో శివానీ, రామారావు, నీలాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హతుడు రమేష్ కుమార్ విశాఖపట్నం వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. భార్య శివానీతో కలిసి ఎంవీపి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ నెల ఒకటో తేదీన డ్యూటీ చేసి వచ్చిన రమేష్ తెల్లారేసరికి మరణించాడు. తన భర్త రమేష్ గుండెపోటుతో మరణించాడని శివానీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రమేష్ హత్యకు ప్రియుడు రామారావుతో కలిసి శివానీ పక్కా ప్రణాళిక వేసి అమలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రామారావు అనే వ్యక్తి వీరి ఎదురింట్లో ఉంటూ, వీరి ఇంటి పక్కన కారును పార్క్ చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం శివానీకి రామారావుతో వైవాహికేతర సంబంధం ఏర్పడింది. దీన్ని గమనించిన రమేష్ రామారావుతో గొడవకు దిగాడు. ఆ తర్వాత శివానీ, రామారావు కొన్ని రోజుల పాటు బయటకు వెళ్లిపోయారు.
అయితే, ఇరు కుటుంబాలకు చెందినవారు శివానీ, రమేష్ ల మధ్య రాజీ కుదిర్చారు. శివానీని ఇంటికి తెచ్చారు. అయినా భార్యాభర్తల మధ్య వివాదం సద్దుమణగలేదు. రామారావు వద్దకే వెళ్లిపోవాలని రమేష్ భార్యను హెచ్చరించాడు. పిల్లలను తీసుకుని వెళ్తానని ఆమె అంటూ వచ్చింది. దీంతో ఇరువురి మధ్య గొడవ మరింత ముదిరింది. ఈ క్రమంలో మరో ఇద్దరికి సుపారీ ఇచ్చి భర్తను రామారావుతో కలిసి హత్య చేసింది. తన వద్ద ఉన్న బంగారాన్ని 1.50 లక్షలకు విక్రయించి అప్పుఘర్ కు చెందిన నీలా అనే వ్యక్తికి శివానీ సుపారీ ఇచ్చింది. ఆగస్టు ఒక్కటో తేదీ రాత్రి రమేష్ మద్యం సేవించి నిద్రపోయాడు. ఈ సమయంలో రమేష్ ముఖంపై నీలా దిండు పెట్టి అదిమిపట్టుకోగా శివానీ కాళ్లు పట్టుకుని హత్య చేశారు. రామారావు ఇంటి బయట కాపలా కాశాడు.
భర్త హత్యను సాధారణ మరణంగా చిత్రీకరించి అతని ఉద్యోగం ద్వారా లభించే ఆర్ఠిర ప్రయోజనాలను, ఉద్యోగాన్ని పొందాలని శివానీ ప్లాన్ వేసింది. రమేష్ హత్య కేసులో శివానీ, రామారావు, నీలాలను నిందితులుగా చేర్చారు. రమేష్, శివానీలకు మూడు, ఐదేళ్ల కూతుళ్లు ఇద్దరు ఉన్నారు.