అక్రమంగా మద్యం తరలిస్తున్నారని ప్రశ్నించిన యువకులు ఎదురుతిరిగిన ఓ యువకుడిపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. దీంతో మనోవేదనకు గురైన అలీషా అనే వ్యక్తి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ మరణించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం భట్రుపాలెంలో చోటు చేసుకొంది.
గుంటూరు: అక్రమంగా మద్యం తరలిస్తున్నారని ఎక్సైజ్ పోలీసులు కొట్టారని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన షేక్ అలీషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మరణించాడు.
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం భట్రుపాలంలో అక్రమంగా మద్యం తరలిస్తున్నారని సమాచారం అందడంతో ఎక్సైజ్ పోలీసులు ఈ గ్రామానికి చేరుకొన్నారు. కారులో షేక్ అలీషాతో పాటు మరో వ్యక్తి మద్యం సరఫరా చేస్తున్నారని ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై ఎక్సైజ్ పోలీసులు వారిని ప్రశ్నించారు. అయితే పోలీసులకు సమాధానం చెప్పకుండా ఎదురుతిరిగారు. దీంతో ఎక్సైజ్ పోలీసులు వారిపై దాడి చేశారు.
ఈ ఘటనతో మనోవేదనకు గురైన షేక్ అలీషా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అలీషా ఇవాళ మరణించాడు.
ఈ విషయమై బాధిత కుటుంబసభ్యులు ఎక్సైజ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలీషా మృతికి ఎక్సైజ్ పోలీసులే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎక్సైజ్ అధికారులపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.