రేపు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన 1980ల్లో ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో టీడీపీ ‘రా.. కదలి రా’ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Kodali Nani: ఏపీ పొలిటికల్ హీట్ అంతా గుడివాడకు షిఫ్ట్ అయింది. రేపు గుడివాడలో టీడీపీ వర్సెస్ కొడాలి నానిగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి రేపు. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ గుడివాడ కేంద్రంగా బిగ్ స్కెచ్ వేసింది. రా కదలి రా అనే ప్రోగ్రామ్‌ను రేపు గుడివాడలో ప్లాన్ చేసింది. అయితే, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు.
టార్గెట్ కొడాలి నాని:
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. టీడీపీపై విమర్శలు చేసే వైసీపీ నేతల్లో కొడాలి నాని ముందువరసలో ఉంటారు. ఒక రకంగా కొడాలి నాని టీడీపీకి కొరకరాని కొయ్యగా మారారు. కానీ, కొడాలి నాని గుడివాడలో బలమైన నాయకుడు. పార్టీతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్ బిల్డ్ చేసుకున్నారు. ఈ సారైనా కొడాలి నానిని ఇంటికే పరిమితం చేయాలని టీడీపీ అనుకుంటున్నది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ వర్ధంతి నేపథ్యంలో గుడివాడలో రా కదలి రా కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నది.
టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కొన్ని దశాబ్దాలు గుడివాడ టీడీపీకి కంచుకోటగా ఉంది. కొడాలి నాని కూడా గుడివాడ నుంచి టీడీపీ టికెట్ పైనే గెలిచారు. 2004, 2009లో ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. పార్టీ మారినా కొడాలి నాని నియోజకవర్గంపై పట్టు నిలుపుకున్నారు. ఆ తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ టికెట్ పై విజయం సాధించారు. గుడివాడ నుంచి కొడాలి నానికి ఎదురే లేకుండా పోయింది.
Also Read : Ayodhya: అయోధ్యలో మసీదు నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏ దశలో ఉన్నది?
హాట్ స్పాట్ గుడివాడ:
గుడివాడ నియోజకవర్గాన్ని మళ్లీ పసుపు మయం చేయాలని టీడీపీ భావిస్తున్నది. అందుకే సీనియర్ ఎన్టీఆర్ సెంటిమెంట్‌తో గుడివాడను కైవసం చేసుకునే ఎత్తులు వేస్తున్నది. ఇందుకు ఎన్నికల ముంగిట వచ్చిన ఎన్టీఆర్ వర్ధంతిని చక్కగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తున్నది. అయితే, కొడాలి నాని కూడా వైసీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకోవడం గమనార్హం. ఆయన కూడా రేపు టీడీపీకి దీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు రేపు గుడివాడ కేంద్రంగా మారనున్నాయి.