
కలిగయుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ వ్యక్తి ఆలయం లోనికి సెల్‌ఫోన్ తీసుకెళ్లాడు. ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి మొబైల్ ఫోన్‌లో వీడియో తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను పరిశీలిస్తే.. వర్షం పడుతున్న సమయంలో ఆనంద నిలయం సమీపంలో చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పని ఎవరూ చేశారనే విషయం తెలియాల్సి ఉంది. ఎవరైనా భక్తుడు ఇలా చేశారా?, లేక మరేవరైనా కావాలనే ఈ పని చేశారా? అనేది తెలియాల్సి ఉంటుంది.
ఇక, తిరుమలలో భారీ భద్రత ఉంటుందనే సంగతి తెలిసిందే. తిరుమల కొండపై పలు ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయి. సీసీటీవీ కెమెరాలతో నిత్యం భద్రతను పర్యవేక్షిస్తుంటారు. చీమ చిటుక్కుమన్న తెలిసేలా భద్రతా వ్యవస్థ పనిచేస్తుందని చెబుతారు. అయితే ఇటీవలి కాలంలో తిరుమలలో చోటుచేసుకుంటున్న ఘటనలపై శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.