చంద్రబాబు విజయవాడ పర్యటనలో భద్రతా వైఫల్యం .. రోడ్డుకి అడ్డుగా లారీ, ట్రాఫిక్‌లో చిక్కున్న కాన్వాయ్

By Siva KodatiFirst Published Jan 13, 2024, 7:16 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. చంద్రబాబు పర్యటనపై పోలీసులు, ట్రాఫిక్ విభాగాలకు ముందస్తు సమాచారం వున్నా వారధిపై లారీని అడ్డుగా పెట్టడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. చంద్రబాబు కాన్వాయ్ విజయవాడ కనకదుర్గ వారధిపై వుండగా.. అధికారులు వారధిపై లారీ అడ్డంపెట్టి విద్యుత్ లైట్ మరమ్మత్తులు చేపట్టారు. చంద్రబాబు పర్యటనపై పోలీసులు, ట్రాఫిక్ విభాగాలకు ముందస్తు సమాచారం వున్నా వారధిపై లారీని అడ్డుగా పెట్టడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వారధిపై ట్రాఫిక్ స్తంభించడంతో చంద్రబాబు కాన్వాయ్ దాదాపు పది నిమిషాల పాటు నిలిచిపోయింది. ఎన్ఎస్‌జీ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేసి కాన్వాయ్‌ని ముందుకు తీసుకెళ్లారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత వున్న చంద్రబాబు విషయంలో అధికారులు ఇలా వ్యవహరించడం సరికాదని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. 

అంతకుముందు చంద్రబాబు నాయుడు తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం , ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఇటీవల ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సీఐడీకి పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్ట్ ఆదేశాల మేరకు సీఐడీ అధికారులకు పూచీకత్తు, బాండ్ పేపర్లను చంద్రబాబు నాయుడు సమర్పించారు. 

కాగా..  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం , ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఇటీవల ఏపీ హైకోర్టు ఒకేసారి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టీ మల్లిఖార్జున రావు ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని, వారం లోపు రూ.లక్ష చొప్పున పూచీకత్తు ఇవ్వాలని ..పిటిషనర్లకు 48 గంటల ముందు నోటీసు ఇచ్చాకే విచారించాలని సీఐడీని ఆదేశించారు. ఇకపోతే .. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనరేష్‌కూ ముందస్తు బెయిల్ మంజూరైంది. 
 

click me!