జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ: హైకోర్టు ఆదేశాలను సమర్థించిన సుప్రీంకోర్టు

By telugu teamFirst Published Aug 17, 2020, 12:01 PM IST
Highlights

ఆర్-5 జోన్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆర్-5 జోన్ ఉత్తర్వులపై హైకోర్టు విధించిన సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు సమర్థించింది.

అమరావతి: ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్-5 ఉత్తర్వుల విషయంలో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. సుప్రీంకోర్టు హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సమర్థించింది. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్-5 ఉత్తర్వులు చేసింది. 

దానిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ పై విచారణ జరుపుతున్న హైకోర్టు విచారణ పూర్తయ్యేంత వరకు ఆ ఉత్తర్వులను సస్పెన్షన్ పెట్టింది. దానిపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే, హైకోర్టు జారీ చేసిన సస్పెన్షన్ ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. 

దానిపై హైకోర్టులో తుది విచారణ జరగాలని సుప్రీంకోర్టు తెలిపింది. రాజధాని భూములను పేదలకు పంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్-5ను జారీ చేసింది. గృహ నిర్మాణ జోన్ (ఆర్-5 జోన్) ఏర్పాటు చేస్తూ ఆ ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ఉత్తర్వులను హైకోర్టు నాలుగు వారాల పాటు సస్ెపండ్ చేసింది. 

రాజధాని మాస్టర్ ప్రణాళిక ప్రకారం నాలుగు నివాస జోన్లు ఉండేవి. జగన్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆర్-5 జోన్ ను ఏర్పాటు చేసింది. రాజధాని ప్రాంతంలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధుల్లోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతిలో సచివాలయ రాజధానిని మాత్రమే కొనసాగిస్తూ కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నానికి, న్యాయ రాజధానిని కర్నూలుకు తరలించాలని నిర్ణయించింది. ఈ విషయంపై కోర్టులో విచారణ సాగుతోంది.   

click me!