
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫార్మసీ కాలేజీ విద్యార్ధిని ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి నిర్దోషిగా బయటకు వచ్చిన సత్యం బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును సీబీఐ మరోసారి టేకప్ చేయడంతో, పలువురు అధికారులను విచారణ చేస్తూ వుండటంతో సత్యంబాబు మీడియాతో మాట్లాడారు. ఆయేషాను చంపింది ఎవరో ఆమె తల్లి తొలి నుంచి చెబుతున్నారని.. కానీ తనను పోలీసులు అక్రమంగా ఇరికించారని సత్యం బాబు ఆరోపించారు. తనను సీబీఐ ఇప్పటి వరకు నాలుగు సార్లు విచారించిందని ఆయన చెప్పారు. ఇప్పుడు మరోసారి సీబీఐ విచారణ నేపథ్యంలో తాను పూర్తిగా సహకరిస్తానని సత్యంబాబు తెలిపారు.
తాను ఈ కేసులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతిని సీబీఐకి వివరించానని చెప్పారు. ఆయేషా మీరాను చంపిన అసలు నిందితులను పట్టుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని సత్యంబాబు డిమాండ్ చేశారు. దాదాపు 15 ఏళ్లు కావొస్తున్నా.. ఈ కేసులో నిందితులను పట్టుకోలేదని ఆయన దుయ్యబట్టారు. ఈ కేసులో తాను నిర్దోషిగా విడుదలయ్యే సమయంలో నష్టపరిహారం, పొలం, ఇల్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందని, కానీ అవేవీ తనకు అందలేన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా తనకు ఎలాంటి న్యాయం జరగలేదని సత్యంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: రూ. 10 లక్షల పరిహారం ఇవ్వండి: కలెక్టర్ ను కోరిన సత్యం బాబు
కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007 డిసెంబర్ 27న B.Pharmacy విద్యార్ధిని ఆయేషా మీరా విజయవాడలోని హాస్టల్ లో దారుణ హత్యకు గురైంది. బాత్రూంలో రక్తం మడుగులో ఆయేషా మీరా అనుమానాస్పదస్థితిలో మరణించింది.తన ప్రేమను తిరస్కరించడంతోనే హత్య చేసినట్టుగా ఓ లేఖ కూడా లభ్యమైంది. అత్యాచారం చేసి ఆయేషా మీరాను హత్య చేశారు.
ఈ కేసులో జగ్గయ్యపేట మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యం బాబుని నిందితుడిగా గుర్తించి 2008 ఆగష్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు నేరస్థులను రక్షించే ఉద్దేశ్యంలో భాగంగా సత్యం బాబును అరెస్ట్ చేశారంటూ అతడి బంధువులు, మానవహక్కుల కార్యకర్తలు ఆరోపించారు. జైలులో ఉన్న సమయంలో సత్యం బాబుకు అనారోగ్యం కారణంగా పక్షవాతం వచ్చింది. మరోవైపు సత్యం బాబు జైలు నుంచి తప్పించుకున్నాడని, అతడిని మళ్లీ అరెస్టు చేసినట్టుగా కూడా పోలీసులు అప్పట్లో తెలిపారు.