ఇదంతా చంద్రబాబు కుట్రనే.. షర్మిల కాంగ్రెస్ లో చేరికపై సజ్జల రియాక్షన్

By Rajesh KarampooriFirst Published Jan 7, 2024, 5:27 AM IST
Highlights

Sajjala Ramakrishna Reddy: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ ఇలా అందర్నీ మేనేజ్ చేస్తూ అధికారం కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు

Sajjala Ramakrishna Reddy: వైఎస్‌ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికను,  ఆమె పార్టీ విలీనంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ ఇలా అందర్నీ మేనేజ్ చేస్తూ అధికారం కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. షర్మిల వల్ల వైసీపీకి ఏ నష్టం లేదన్నారు. ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని, వారి గురించి తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని, గత రెండు ఎన్నికల్లో వారికి ఒక్క సీటు కూడా రాలేదని, ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గుర్తించడం లేదని ఏద్దేవా చేశారు. 

షర్మిల ఏపీకి వచ్చారని ఇప్పటివరకూ ఏ ప్రకటన రాలేదని, ఆమె దేశంలో ఎక్కడైనా పనిచేసే ఛాన్స్ ఉందన్నారు. వైఎస్ రాజశఖరెడ్డి హత్యలో కాంగ్రెస్ పాత్ర ఉందని మేం చెబుతూనే ఉన్నామని, షర్మిల భర్త బ్రదర్ అనిల్‌పై అనేక ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు ఆయన పక్కనే నిలబడి ఫొటోలు దిగడం చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు పన్నిన నీచమైన పథకం ప్రకారమే టీడీపీ నేత బీటెక్ రవి బ్రదర్ అనిల్‌ను కలిశారని అన్నారు.

రాజకీయ లబ్ధి కోసం కుటుంబ సభ్యులను కాంగ్రెస్‌ ఇరకాటంలో పడేస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ తొలినాళ్లలో వైఎస్‌ వివేకానందరెడ్డిని కాంగ్రెస్‌ ఎన్నికల బరిలో నిలిపిందని సజ్జల అన్నారు. జగన్ పెట్టిన వైఎస్సార్ సీపీని చీల్చాలని, బలహీన పరచాలని చూసినా ఏం చేయలేదని పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలవలేనని చంద్రబాబు నాడు గ్రహించి షర్మిల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

సంక్షేమం విషయంలో తనకు మైనస్ మార్కులు పడతాయని చంద్రబాబు నాయుడుకు తెలుసు. అతను ఎప్పుడూ ఎవరో ఒకరి ద్వారా రాజకీయ ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను తమ పార్టీ ప్రత్యర్థిగా పరిగణించదని అన్నారు.  

వైఎస్సార్ మరణంపై సైతం అనుమానాలు ఉన్నాయని, ఇప్పుడు మరికొన్ని విషయాల్లో జగన్ పై దుమ్మెత్తి పోసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ లో షర్మిల చేరిక సైతం చంద్రబాబు కుట్రల్లో భాగమేననీ, అభివృద్ధి అనేది లేకుండా, సైడ్ ట్రాక్ రాజకీయాలతో లబ్ది పొంది అధికారంలోకి రావాలని చూడటమే చంద్రబాబు వ్యూహామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

click me!