
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాల్లో స్థిరపడిన తమ దేశ పౌరులకు ఆఫ్రికన్ దేశం రువాండ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న ఈ దేశస్థులు కూడా ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో రువాండ దేశానికి చెందిన చాలా మంది విద్యార్థులు విధ్యనభ్యసిస్తున్నారు. వీరికోసం ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లి మండలం వడ్డేశ్వరం లోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రం ద్వారా దాదాపు 30 మంది విద్యార్థులు ఓటుహక్కును వినియోగించుకున్నట్లు రిపబ్లిక్ ఆఫ్ రువాండ హైకమీషన్ తెలిపింది.
ఈ ఓటింగ్ సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ రువాండ హైకమీషనర్ ఎర్నెస్ట్ అర్వమోషియో కేఎల్ యూనివర్సిటీని సందర్శించారు. ఈ యూనివర్సీటి వైస్ చాన్సలర్ రామ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. అతను కూడా తన ఓటు హక్కును ఇక్కడే వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఎర్నెస్ట్ మాట్లాడుతూ...ఈ యూనివర్సిటీలో కూడా చాలా మంది తమ దేశ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు తెలిపారు. తమ దేశ ఎన్నికల కోసం సౌకర్యాలను కల్పించి సహకరించినందు కేఎల్ యూనివర్సిటీ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.