చంద్రబాబు ట్వీట్ వైరల్: వైఎస్ జగన్ ఇంటి కిటికీలకు రూ.73 లక్షలు

By telugu teamFirst Published Nov 7, 2019, 1:19 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇంటి కిటికీలకు ప్రభుత్వం రూ.73 లక్షలు మంజూరు చేసిందని, ఇది అత్యంత అధిక మొత్తమని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి కిటికీలకు రూ.73 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. దానిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో కామెంట్ చేశారు. జగన్ ఇంటికి రూ.73 లక్షలను మంజూరు చేయడాన్ని అత్యధిక వ్యయంగా ఆయన వ్యాఖ్యానించారు. 

ప్రభుత్వ ఉత్తర్వులను జత చేస్తూ జగన్ ఇంటి మరమ్మత్తులకు నిధులను మంజూరు చేయడంపై బుధవారంనాడు చంద్రబాబు తన వ్యాఖ్యలను ట్విట్టర్ లో పోస్టు చేశారు. దాన్ని వైఎస్ జగన్ కు ట్యాగ్ కూడా చేశారు. తన ఇంటికి కిటికీలను అమర్చుకోవడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.73 లక్షల భారీ మొత్తాన్ని కేటాయించిందని, ఈ అత్యధిక వ్యయం ప్రభుత్వ ఖజానా నుంచే అవుతుందని, గత ఐదు నెలలుగా ఆర్థిక నిర్వహణ లోపాల వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారిన సమయంలో ఆ మొత్తాన్ని కేటాయించారని, ఇది అత్యంత ఆందోళకరమైన విషయమని చంద్రబాబు ట్వీట్ చేశారు. 

తాడేపల్లిలోని సిఎం నివాసంలో, క్యాంప్ ఆఫీసులో అల్యూమినియం కిటికీలు, తలుపులను సరఫరా చేసి,త వాటిని అమర్చడానికి, ఇతర పనులకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆ ఉత్తర్వులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పందించారు. రూ.73 లక్షల మంజూరు నమ్మశక్యం కాని విషయంమని ఆయన అన్నారు. మైండ్ బ్లాగింగ్ రూ.73 లక్షలు, రూ.73 లక్షలు అని మళ్లీ చెబుతున్నా, వైఎస్ జగన్ ఇంటి కిటికీలకు కేటాయించారని ఆయన అన్నారు. ఒక్క రూపాయి జీతం మాత్రమే తీసుకుంటానని చెబుతున్నారని, ఆ విధమైన హిపోక్రసీ అని లోకేష్ అన్నారు.

ముఖ్యమంత్రి ఇంటి కిటికీలకు రూ.73 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ జారీ జీవోను వైరల్ చేయడానికి టీడీపీ సోషల్ మీడియా బృందాలు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. గత ఐదు నెలల కాలంలో జగన్ తన ఇంటికి 16 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని లోకేష్ ఆరోపిస్తున్నారు. 

click me!