
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గం నేడు కొలువుదీరనుంది. శ్రీరామ నవమి సందర్భంగా కొత్త మంత్రులు ఎవరనేది ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో అనేక మంది కొత్త వ్యక్తులకు చోటు ఇచ్చారు. పలువురికి సీఎం జగన్ కేబినేట్ లో రెండో సారి కూడా అవకాశం లభించింది. మంత్రులుగా ఎంపికైన వారి పేర్లు అయితే ప్రకటించారు గానీ ఎవరికీ ఏ శాఖలు కేటాయిస్తున్నారో మాత్రం చెప్పలేదు.
కొత్త మంత్రులందరూ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్పుడే ఎవరికీ ఏ మినిస్ట్రీ వస్తుందో తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో మంత్రిగా ఎంపికైన రోజా అభిమానులు కొంత అత్యుత్సాహం చూపించారు. ఆమె వికీపిడియాలో హోం మినిస్ట్రీని ఇప్పటికే జత చేసేశారు. 2022 ఏప్రిల్ 11వ తేదీన రోజా ఆంధ్రప్రదేశ్ హోం మినస్టర్ గా బాధ్యతలు చేపట్టారని అందులో పేర్కొన్నారు. దీనిని గమనించిన వ్యక్తులు ఇది రోజా అభిమానుల పనే అని చెప్పుకుంటున్నారు.
వికీపిడియాలో ఒకరి ప్రొఫైల్ ను ఎవరైనా ఎడిట్ చేయవచ్చు. మార్పులు, చేర్పులు చేసేందుకు, అందరికీ విజ్ఞానాన్ని ఉచితంగా అందుబాటులో ఉంచేందుకు వికీపిడియా ఈ అవకాశం ఇస్తుంది. దీని ఆధారంగానే చాలా మంది వికీపిడియాలో సమాచారాన్ని జత చేస్తూ ఉంటారు. అయితే కొందరు వ్యక్తులు తాము అభిమానించే వారి విషయంలో కొంత అత్యుత్సాహంతో ఇలా ముందుగానే ఎడిట్ చేస్తున్నారు. ఈ వికీపిడియా క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియా గ్రూప్స్ లో సర్క్యూలేట్ అవుతోంది.
మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న ఆర్కే రోజా తెలుగు ప్రజలందరికీ సుపరిచితమే. ఆమె తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆమె రాజకీయ అరంగేట్రం తెలుగుదేశం పార్టీతో మొదలైంది. 1999లో రోజా టీడీపీలో చేరారు. అనంతరం 2004,2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తరువాత కాలంలో ఆమె వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కూడా అదే నియోజకర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 సమయంలో నుంచి రోజా ఏపీఐఐసీ చైర్మన్ గా పని చేస్తున్నారు. ఇప్పుడు సీఎం జగన్ కేబినేట్ లో మంత్రిగా స్థానం దక్కించుకున్నారు.