
అనంతపురం (anantpur district) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) సంభవించింది. బత్తలపల్లి (bathalapalli) మండలం జ్వాలాపురం (jwalapuram) వద్ద జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు. వీరంతా చిత్తూరు జిల్లా (chittoor district) మదనపల్లికి (madanapalle) చెందినవారు. ఈ కుటుంబం కారులో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కారు ముందు వైపు టైరు ఒక్కసారిగా పేలడంతో వాహనం అదుపుతప్పి అనంతపురం నుంచి చెన్నై (chennai) వెళ్తున్న లారీని బలంగా ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అమ్మాజి(50), కుమారుడు రెడ్డి భాషా(25), కుమార్తె రేష్మ(30), అల్లుడు బాబు(36) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాబు, రేష్మల కుమార్తె జస్మిత(5)కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిన్నారిని చికిత్స నిమిత్తం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులో చిక్కుకున్న మృతదేహాలను స్థానికుల సాయంతో బయటకు తీశారు.