ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ నియమితులయ్యారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో ఆయన పదవీబాధ్యతలు చేపడుతారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి కనగరాజ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం 619 నెంబర్ జీవో జారీ అయింది. కొత్త నిబంఘధనల మేరకు రిటైర్డ్ జడ్జిని ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కనగరాజ్ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. వివిధ కమిషన్లలో సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. 9 ఏళ్లు పాటు ఆయన న్యాయమూర్తిగా పనిచేశారు. విద్య, మహిళలు, వృద్ధుల సంక్షేమాలకుసంబంధించిన కేసుల్లో ఆయన కీలకమైన తీర్పులు వెలువరించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో కనగరాజ్ పదవీబాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి కొత్త నిబంధనలను రూపొందిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఆర్డినెన్స్ మేరకు రమేష్ కుమార్ తన పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఆయన స్థానంలో కనగరాజ్ ను నియమించారు.
రమేష్ కుమార్ కు ఉద్వాసన పలకడంపై ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గవర్నర్ కు లేఖ కూడా రాశారు. అయినప్పటికీ జగన్ వెనక్కి తగ్గలేదు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రామసుందర రెడ్డిని నియమించినట్లు శుక్రవారం రాత్రి వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత అవి పుకార్లు మాత్రమేనని తేలింది.