ఏపీలోని మదనపల్లె మార్కెట్‌లో కిలో టమాటా డబుల్ సెంచరీ కొట్టేసింది. ఈ రోజు మార్కెట్‌లో మేలిరకం టమాటాలు కిలోకు రూ. 200 వరకు పలికింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె టమాటాలకు పేరుగాంచింది. ఈ సారి ఇక్కడ కూడా టమాటా రికార్డు ధర పలికింది. తాజాగా, కిలో టమాటా ఇక్కడ డబుల్ సెంచరీ కొట్టేసింది. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ధర పెరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
మదనపల్లెలో కిలో టమాట గరిష్టంగా రూ. 200 పలికినట్టు తెలిసింది. కనిష్టంగా రూ. 140కు అమ్మకాలు జరిగాయి. మదనపల్లె ప్రాంతంలో సీజన్ చివరి దశ కావడం, ఇతర ప్రాంతాల్లో ఇంకా దిగుబడి రాకపోవడం, అదీగాక, భారీ వర్షాలతో నష్టాలు చోటుచేసుకోవడంతో టమాటా ధర మరింత పెరిగినట్టు తెలుస్తున్నది. మదనపల్లె మార్కెట్‌కు శనివారం తక్కువ మొత్తంలోనే టమాటా వచ్చింది. కేవలం 253 టన్నుల టమాట మాత్రమే మార్కెట్‌కు వచ్చినట్టు తెలిసింది.
మేలి రకమైన టమాటాలు కిలోకు రూ. 160 నుంచి రూ. 200 వరకు డబ్బులు చెల్లించి వ్యాపారులు కొన్నారు. అదే రెండో రకం టమాటాలకు రూ. 120 నుంచి రూ. 156లు చెల్లించి కొనుగోలు చేశారు. మార్కెట్‌లో 25 కిలోల టమాటా బాక్స్ ధర రూ. 4,500 నుంచి రూ. 5000 వరకు పలికినట్టు సమాచారం.
Also Read: Manipur Violence: మణిపూర్ హింస వెనుక విదేశీ హస్తం? ఆ శక్తులకు చైనా సహకారం: ఆర్మీ మాజీ చీఫ్ వ్యాఖ్యలు
మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి కొత్త పంట వచ్చే వరకు ఈ ధరలు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఇది వరకే చెప్పారు. అయితే, ఇంతలో భారీ వర్షాలు దేశమంతటా విస్తారంగా పడటంతో పంట నష్టం కూడా జరిగింది. ఆ పంట ఎప్పుడు మార్కెట్‌కు వస్తుందో.. ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాల్సి ఉన్నది.