కర్నూలులో రాయలసీమ గర్జన సభ.. భారీగా తరలివస్తున్న జనం..

By Sumanth KanukulaFirst Published Dec 5, 2022, 11:41 AM IST
Highlights

మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలో నేడు రాయలసీమ సభ గర్జన సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు రాయలసీమ జిల్లాల పెద్ద ఎత్తున జనం, వైసీసీ శ్రేణులు తరలివస్తున్నారు.

మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలో నేడు రాయలసీమ సభ గర్జన సభ నిర్వహిస్తున్నారు. మేధావులు, న్యాయవాదులు, విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సభకు అధికార వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది. ఈ సభకు రాయలసీమ జిల్లాల పెద్ద ఎత్తున జనం, వైసీసీ శ్రేణులు తరలివస్తున్నారు. పలువురు వైసీపీ మంత్రులు, ముఖ్య నేతలు సభ వేదిక వద్ద నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కర్నూలుకు న్యాయ రాజధానే లక్ష్యంగా ఈ సభను నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ది చెందాలనేదే  తమ ఆకాంక్ష అని.. ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతిస్తున్నట్టుగా చెప్పారు. రాయలసీమను గత ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని తప్పకుండా అమలు చేయాలని కోరుతున్నారు. 

వికేంద్రీకరణ కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా  అభివృద్ది చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అసలు చిత్తశుద్ది లేదని విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. రాయలసీమ వాసులకు మంచి చేయాలనే ఆలోచనే చంద్రబాబుకు లేదని అన్నారు. వికేంద్రీకరణతో టీడీపీకి మనుగడ ఉండదని చంద్రబాబు  నాయుడకు భయం పట్టుకుందని విమర్శించారు. 

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే వరకూ ఉద్యమిస్తామని రాయలసీమ జేఏసీ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని.. కానీ కొన్ని శక్తులు ఆడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.  'సీమ గర్జన'తో ప్రజల ఆకాంక్షను ఈ రోజు తెలుపబోతున్నామని చెప్పారు. 

రాయలసీమ గర్జన నేపథ్యంలో పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇతర జిల్లాల నుండి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం నగర శివార్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లక్ష మందికి పైగా ఈ సభకు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. 

click me!