కరువు నియోజకవర్గంగా నిలిచిన రాయదుర్గం ఈ సారి ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ సారి వైసీపీ నుంచి మెట్టు గోవింద రెడ్డి, టీడీపీ నుంచి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు బరిలో నిలిచారు. వీరిలో ఎవరిది విజయం అనేది మరి కాసేపట్లో తేలనుంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం విలక్షణ భౌగోళిక పరిస్ధితులకు నెలవు. కర్ణాటక సరిహద్దుల్లో వుండే ఈ రాయదుర్గానికి చారిత్రక నేపథ్యం వుంది. విజయనగర రాజుల పాలనా వైభవానికి, రాజసానికి చిహ్నంగా నిలిచింది. రాజులు, రాచరికం అంతరించినా ఆ వైభవం మాత్రం నేటికి గుభాళిస్తూనే వుంది. కరువు రక్కసి కారణంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఎడారి ఛాయలు నానాటికీ విస్తరిస్తున్నాయి. ఈ ప్రాంత ప్రజలు కన్నడ, తెలుగు రెండు భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. గతంలో ఆంధ్రాలో వున్న బళ్లారి జిల్లాను కర్ణాటకలో కలపడంతో బళ్లారి జిల్లాలోని రాయదుర్గం అనంతపురం జిల్లాలోకి చేరింది. వేరుశెనగ, పత్తి , మిర్చి పంటలతో పాటు జీన్స్ ఫ్యాంట్ల తయారీ పరిశ్రమకు రాయదుర్గం కేంద్రం.
రాయదుర్గం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024.. 2009 వరకు కాంగ్రెస్ హవా :
1952లో ఏర్పడిన రాయదుర్గం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,49,553 మంది. డీ హీరేహల్, రాయదుర్గం, కనేకల్, బొమ్మనహల్, గుమ్మగట్ట మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో వున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాయదుర్గం కంచుకోట. హస్తం పార్టీ 9 సార్లు, టీడీపీ మూడు సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు ఇక్కడ విజయం సాధించారు. పాటిల్ వేణుగోపాల్ రెడ్డి , కాపు రామచంద్రారెడ్డిలు మూడు సార్లు, తిప్పేస్వామి, బండి హులికుంటప్ప రెండు సార్లు విజయం సాధించారు.
కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థల్లో ఎండీగా పనిచేస్తున్న కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వైఎస్ మరణం తర్వాత జగన్ వెనుక రామచంద్రారెడ్డి నడిచారు. 2012 ఉప ఎన్నికల్లో, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.
రాయదుర్గం శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. కాపు రామచంద్రారెడ్డిని పక్కనపెట్టిన జగన్ :
2024 ఎన్నికలకు సంబంధించి రాయదుర్గంపై తన పట్టు కోల్పోకూడదని జగన్ భావించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, తనకు విధేయుడైన కాపు రామచంద్రారెడ్డికి జగన్ మెట్టు గోవింద రెడ్డిని వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దించారు. మరోవైపు టీడీపీ రాయదుర్గంలో అడపా దడపా విజయాలను సాధిస్తూ వచ్చింది. ఈసారి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులను చంద్రబాబు బరిలో దించారు. మెట్టు గోవింద రెడ్డి, కాలువ శ్రీనివాసులు ఇద్దరులో ఎవరు విజేత అనేది కాసేపట్లో క్లారిటీ రానుంది.