జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల కీలక నివేదిక..

By Sumanth Kanukula  |  First Published Oct 14, 2023, 3:56 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు నివేదిక వెలుగులోకి వచ్చింది.


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు నివేదిక వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు రిపోర్టులో పేర్కొన్నారు. చంద్రబాబు చేతులు, ముఖంతో పాటు కొన్ని శరీర భాగాల్లో దద్దుర్లు, స్కిన్ ఎలర్జీ ఉన్నట్టుగా వైద్యులు నిర్దారించారు. అంతేకాకుండా తీవ్రమైన ఎండల వల్ల డీహైడ్రేషన్‌తో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. డీహైడ్రేషన్ వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పలు రకాల మందులను  కూడా సిఫార్సు చేశారు. ఈ మేరకు జి సూర్యనారాయణ,వి సునీతాదేవీలతో కూడిన వైద్యుల బృందం జైలు అధికారులకు నివేదికను అందజేసింది.

అయితే చంద్రబాబు కి హైపర్ ట్రోఫీక్ కార్డియో మైయోపతి సమస్య ఉందని ఆయన వ్యక్తి గత వైద్యులు పేర్కొంటున్నారు.ఈ సమస్య కారణంగా డీహైడ్రేషన్ తో గుండె పైనా ప్రభావ పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలను ప్రభుత్వం, అధికారులు చిన్నవి చేసి చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా బయటపడిన డాక్టర్ల నివేదికతో చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నట్టుగా పేర్కొన్నారు. ఇక, చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ను బటయపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుందని జైలు అధికారులు చెప్పుకొచ్చారని.. అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక ఉందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. 

Latest Videos


ఇక, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో నెల  రోజులకు పైగా రిమాండ్‌లో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైలులో వేడిని తట్టుకోలేని కారణంగా చంద్రబాబు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని.. అలాగనే చర్మంపై అలర్జీ కారణంగా దద్దుర్లు వచ్చినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన భర్త ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్టుగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. జైలులో ఆయనకు అవసరమైన వైద్య చికిత్సను సకాలంలో అందించాలని కోరారు. చంద్రబాబు ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని.. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జైలులోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని చెప్పారు. ఈ విపత్కర పరిస్థితులు తన భర్త జీవితానికి స్పష్టమైన, తక్షణ ముప్పును కల్పిస్తున్నాయని అన్నారు. 

చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. చంద్రబాబుకు ఉద్దేశపూర్వకంగా హాని తలపెట్టేందుకు చూస్తున్నారని.. ఆయన భద్రత ప్రమాదంలో ఉందని అన్నారు. చంద్రబాబు దోమలతో జీవిస్తున్నారని, ఆయనకు కలుషిత నీరు ఇస్తున్నారని లోకేష్ అన్నారు. బరువు తగ్గడం, ఇన్ఫెక్షన్లు, అలెర్జీలతో బాధపడుతున్నారని.. సకాలంలో వైద్య సహాయం అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వం స్టెరాయిడ్స్ ఎక్కించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే ఆ బాధ్యత సీఎం జగన్‌దేనని అన్నారు.  

అయితే చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు చేస్తున్న ఆరోపణలపై అధికారులు స్పందించారు. జైళ్ల శాఖ డీజీపీ (ఉత్తర కోస్తా ఆంధ్ర) రవికిరణ్ విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు గత నెల రోజుల్లో 5 కిలోల బరువు తగ్గినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పారు. సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి అతడిని జైలుకు తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు బరువు 66 కిలోలు కాగా.. ఇప్పుడు ఆయన బరువు 67 కిలోలు అని అన్నారు. చంద్రబాబుకు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్‌ఎస్) ఇస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు చర్మంపై ఎలర్జీ, దద్దుర్లు ఉన్నాయని.. రాజమండ్రి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు చెందిన చర్మవ్యాధి నిపుణుల బృందం అతనికి చికిత్స చేసి, చర్మ అలెర్జీకి మందులు, లోషన్‌ను ఇచ్చిందని అతను చెప్పారు. 

click me!