బీజేపీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

By rajesh yFirst Published Sep 18, 2018, 6:30 PM IST
Highlights

కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కర్నూల్ జిల్లా ఎస్టీబీసీ మైదానంలో జరిగిన సత్యమేవ జయతే బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. 
 

కర్నూల్: కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కర్నూల్ జిల్లా ఎస్టీబీసీ మైదానంలో జరిగిన సత్యమేవ జయతే బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. 

కాంగ్రెస్ పార్టీ ఏపీకి 5ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే బీజేపీ పదేళ్లు ఇస్తామన్నదని గుర్తు చేశారు. అయితే మోదీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లు అయినా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారని రాహుల్ ధ్వజమెత్తారు. విభజన చట్టాలను అమలు చెయ్యడంలో మోదీ ప్రభుత్వం విఫలమయ్యిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. 

ప్రధానిగా కుర్చీలో కూర్చునేందుకు రాలేదని దేశానికి కాపలా దారుడిగా ఉంటానన్న నరేంద్రమోదీ ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి 9వేల కోట్లు దోచుకున్న ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా లండన్ కు పారిపోతుంటే కాపలాదారుడిగా ఏం చేశారని ప్రశ్నించారు. విజయ్ మాల్యా లండన్ పారిపోయేముందు ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారన్నారు. 

ఆర్థిక నేరస్థుడు దేశం విడిచిపెట్టి వెళ్లిపోతున్నాడని తెలిసినా అరుణ్ జైట్లీ ఈడీకి గానీ, సీబీఐకు గానీ సమాచారం ఇవ్వకపోవడం వెనుక ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు. పోలీస్ దొంగ కలిసినట్లు విజయ్ మాల్యా, అరుణ్ జైట్లీ ఒక్కటయ్యారని వారి మధ్య అవినీతి ఒప్పందం జరిగిందన్నారు.  

ప్రధాని నరేంద్రమోదీ అవినీతి పరుడంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 126 రాఫెల్ యుద్ధ విమానాలను ఒక్కో విమానం 526 కోట్లకు కొనుగోలు చేస్తే బీజేపీ ప్రభుత్వం ఒక్కో విమానాన్ని 1600 కోట్లకు కొనుగోలు చేశారని ఆరోపించారు. యుద్ధ విమానాలను అందించడంలో ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన హెచ్ఏఎల్ సంస్థను తప్పించిన నరేంద్రమోదీ తన స్నేహితుడైన అనిల్ అంబానీకి కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. 

70 ఏళ్లుగా యుద్దవిమానాలను అందిస్తున్న హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థను తప్పించడం వెనుక పెద్ద కుట్ర జరిగిందన్నారు. విజయ్ మాల్యా 9వేల కోట్లు దోచుకున్న దొంగ అయితే 45 వేల కోట్లు రూపాయలు దోచుకున్న గజదొంగ అనిల్ అంబానీ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. 
 
2014 తర్వాత నరేంద్ర మోదీ అనేక హామీలిచ్చారని అందులో ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని రాహుల్ ప్రశ్నించారు. ధన్ జన్ యోజన పథకం ద్వారావ ఒక్కో అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తామన్న మోదీ ఎంతమంది అకౌంట్లో జమచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు అందులోనూ వైఫల్యం చెందారని రాహుల్ దుయ్యబుట్టారు. ఏడాదికి 2 రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కానీ ఎక్కడా కల్పించలేదన్నారు. 

నరేంద్రమోదీలా తనకు అబద్ధపు వాగ్దానాలు ఇవ్వడం రాదన్నారు రాహుల్ గాంధీ. కర్నూలు వచ్చింది అబద్ధాలు చెప్పేందుకు కాదన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలిసంతకం ప్రత్యేక హోదాపైనేనని స్పష్టం చేశారు. అలాగే రైతు రుణామాఫీ పూర్తి స్థాయిలో చేస్తామని హామీ ఇచ్చారు.    

click me!