వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ పిటిషన్ దాఖలైంది.
అమరావతి: తన అరెస్టుపై వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది ఆదినారాయణ రావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రఘురామకృష్ణమ రాజుకు సిఐడి కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
బెయిల్ దరఖాస్తును హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి డిస్మిస్ చేయడాన్ని సవాల్ చేస్తూ రఘురామకృష్ణమ రాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనను అరెస్టు చేశారని రఘురామకృష్ణమ రాజు ఆ పిటిషన్ అన్నారు.
ఇదిలావుంటే, వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది. రఘురామకృష్ణమ రాజు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. నేరుగా తమ వద్దకు రావడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. దాదాపు 45 నిమిషాల పాటు హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి.
సెషన్స్ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేయాలని హైకోర్టు సూచించింది. రఘురామ కృష్ణమరాజు వాదనలతో హైకోర్టు ఏకీభవించలేదు. రఘురామకృష్ణమ రాజు అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు కోవిడ్ వచ్చే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో కోవిడ్ నిబంధనల మేరకు రఘురామకృష్ణమ రాజును విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రస్తుత పరిస్థితిలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
గతంలో ఓ యూనివర్శిటీ వీసీ నేరుగా హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయినప్పటికీ హైకోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారు కాబట్టి హైకోర్టుకు వచ్చామని రఘురామకృష్ణమ రాజు న్యాయవాది చెప్పారు.
కుట్రపూరితంగా సిఐడి కేసు నమోదు చేసిందని, ఆధారాలు లేకుండా ఓ ఎంపీని అరెస్టు చేయడం సరి కాదని రఘురామకృష్ణమ రాజు న్యాయవాది అన్నారు.
కాగా, తమ కస్టడీలో ఉన్న వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమరాజుకు గుంటూరు సిఐడీ అధికారులు అల్పాహారం, మందులు అందించారు. మరోసారి ఆయనను సిఐడి అధికారులు శనివారం విచారిస్తున్న విషయం తెలిసిందే. కాగా, రఘురామకృష్ణమ రాజు వేసిన హౌస్ మోషన్ పిటిషన్ మీద మధ్యాహ్నం విచారణ జరుగనుంది.
తన అరెస్టును సవాల్ చేస్తూ రఘురామకృష్ణమ రాజు శుక్రవారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ పూర్తయ్యే వరకు మెజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరు పరచవద్దని కోర్టు ఆదేశించింది. ఆయనకు కస్టడీలో తగిన సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. ఆహారం, వైద్యం, వసతి వెసులుబాట్లు కల్పించాలని కూడా సూచించింది.
సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని సిఐడి ఆయనపై అభియోగం మోపింది. అంతేకాకుండా అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చారని ఆయనపై కేసు నమోదు చేసింది. శనివారంనాడు విచారణకు ముందే రఘురామకృష్ణమ రాజుకు వైద్య పరీక్షలు చేయించారు.