రోజాను అలా చేశారు: భావోద్వేగానికి గురై కంటతడి పెట్టిన పుష్పశ్రీవాణి

By telugu teamFirst Published Jun 13, 2019, 2:36 PM IST
Highlights

తాను రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, మొదటిసారి ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో అడుగుపెట్టానని, అయితే ఈ సభలో విలువలు, విశ్వసనీయతను గత సభలో చూడలేకపోయామని పుష్పశ్రీవాణి అన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి గురువారంనాడు భావోద్వేగానికి గురయ్యారు. స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ఆమె శాసనసభలో కంటతడి పెట్టారు. ఒక గిరిజన మహిళ అయిన తనను డిప్యూటీ సీఎంగా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని ఆమె ప్రశంసించారు. 

అట్టుడుగు వర్గాల గొంతు కూడా చట్టసభల్లో వినిపించేలా అవకాశం కల్పించారని పుష్పశ్రీవాణి అన్నరు. గత సభలో విలువలు, విశ్వసనీయతకు పాతర వేశారని, ఈ సభ గొప్పగా నడుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.  స్పీకర్ గా ఎన్నికైనందుకు ఆమె తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపారు. 

"స్పీకర్‌ అంటే ఇక్కడున్నటువంటి 174 మంది సభ్యులకు కూడా మీరు కుటుంబ పెద్దలాంటి వారు. ఆరుసార్లు శాసన సభకు ఎన్నికై..మంత్రిగా అనేక సంవత్సరాలుగా పని చేసిన మీకు స్పీకర్‌ పదవి అప్పగించడం సహేతుకంగా భావిస్తున్నాను" అని ఆమె అన్నారు. 

తాను రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, మొదటిసారి ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో అడుగుపెట్టానని, అయితే ఈ సభలో విలువలు, విశ్వసనీయతను గత సభలో చూడలేకపోయామని పుష్పశ్రీవాణి అన్నారు. రాజ్యాంగ విలువలు దెబ్బతీసిన తీరు చూసి బాధపడినట్లు తెలిపారు. ఇదే సభలో అప్పుడు చిన్న వయసులో ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చూపిన తీరు చూసి గర్వపడ్డానని అన్నారు. 

ఏ సభలో అయితే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారో అదే సభను గొప్పగా నడిపిస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జగన్ రాజకీయ ప్రాధాన్యత కల్పించారని, ఒక గిరిజన మహిళ అయిన తనను ఒక ఉప ముఖ్యమంత్రిగా చేసి దేశానికే గొప్ప సంకేతాన్ని పంపించారని అన్నారు. 
 
ఆనాటి సభలో మహిళా ఎమ్మెల్యే అయిన ఆర్కే రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేసిన తీరును చూశామని, మహిళల సమస్యలను మీ వద్ద విన్నవించుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. ప్రతిపక్ష నాయకుడికి కూడా మైక్‌  ఇవ్వని సంప్రదాయం చెరిపి..ఈ సభలో అందరికి మైక్‌ ఇచ్చి మాట్లాడే అవకాశం కల్పించాలని ఆమె స్పీకర్ ను కోరారు

click me!