ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే జనసేన, బిజెపి మధ్య పొత్తు ఉంది. మరోవైపు జనసేన, టిడిపి మధ్య కూడా ఇటీవలే పొత్తు ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ-జనసేన- బిజెపి కలిసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లే విషయాల మీద చర్చలు జరుగుతున్నాయి.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్లో టీడీపీ-బీజేపీ పొత్తు హాట్ టాపిక్ గా మారింది. టిడిపి తో బిజెపి జతగట్టబోతోందని తీవ్రంగా చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. ఆ మరుసటి రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ కూడా ఢిల్లీకి వెళ్లి వచ్చారు.
కానీ జగన్ మాత్రం ప్రధాని మోడీతో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. దీంతో జగన్ పర్యటన రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టులపై విజ్ఝప్తికే అని అంటున్నారు. మరోవైపు ఈ పర్యటన వెనుక రాజకీయ కారణాలున్నాయనీ వినిపిస్తుంది.
టీడీపీ, బీజేపీ పొత్తు... లాభం ఎవరికి?
ఇప్పుడు తాజాగా ఏపీ బీజేపీ అధినేత పురందరీశ్వరి, బిజెపి ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్లో టీడీపీ బీజేపీ పొత్తులపై మరోసారి చర్చలు సాగుతున్నాయి. ఈనెల 17వ తేదీన బిజెపి అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి సహా ముఖ్య నేతలు కొంతమంది ఢిల్లీకి వెళ్ళనున్నారు. రెండు రోజులపాటు ఢిల్లీలో ఎన్నికల సాధ్యత పై జరిగే బిజెపి జాతీయ సదస్సులో పాల్గొంటారు. మరోవైపు ఇదే సమయంలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి బిజెపి పెద్దలతో సమావేశం కానున్నారు. సీట్ల సర్దుబాటుపై హై కమాండ్ తో చర్చిస్తారని సమాచారం.
అంతేకాదు బిజెపి ఏఏ నియోజకవర్గాల్లో పోటీ చేసే బాగుంటుందో ఆ నియోజకవర్గాల జాబితాను కూడా ఇవ్వనున్నారట. ఆశావహుల జాబితా, ఓట్ షేర్ పొత్తులతో కలిసి వచ్చే అవకాశాల మీద ఈ సమావేశంలో చర్చలు జరగవచ్చని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే జనసేన, బిజెపి మధ్య పొత్తు ఉంది. మరోవైపు జనసేన, టిడిపి మధ్య కూడా ఇటీవలే పొత్తు ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ-జనసేన- బిజెపి కలిసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లే విషయాల మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పురందేశ్వరి ఢిల్లీ యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది.