ప్రకాశం జిల్లాలో సైకో హల్ చల్, అన్నాదమ్ములపై గొడ్డలితో విచక్షణారహిత దాడి..

By SumaBala BukkaFirst Published Oct 7, 2022, 12:06 PM IST
Highlights

ప్రకాశం జిల్లాలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. గొడ్డలితో ఇద్దరు అన్నాదమ్ముల మీద విచక్షణారహితంగా దాడికి దిగాడు. 

ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం ఎడవల్లిలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. గ్రామంలో ఇద్దరిపై గొడ్డలితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే… ఎడవల్లికి చెందిన బత్తుల శ్రీనివాసులు కొంతకాలంగా మూగజీవాలు, వ్యక్తులపై దాడి చేస్తూ సైకోల ప్రవర్తిస్తున్నాడు. ఈ ఉదయం అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు రమణయ్య, వెంకటనారాయణలపై కూడా గొడ్డలితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.

అది గమనించిన స్థానికులు.. అతడిని అక్కడినుంచి తరిమి,  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దోర్నాల సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి ప్రాథమిక చికిత్స అనంతరం..  మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. సైకోపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 

కానిస్టేబుల్ తో ఎస్సై ప్రేమవివాహం.. ఆ తరువాత వేధింపులు...

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 26న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్, శ్రీనివాస కాలనీల్లో ఆగంతకుడు వీరంగం సృష్టించాడు. కాలనీలో ఇంటిముందు నిలిపి ద్విచక్రవాహనాలకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇలా రెండు చోట్ల చేశాడు. దీంతో అక్కడ ఉన్న మొత్తం వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలు గమనించిన స్థానికులు అక్కడికి చేరుకునేసరికే ఘోరం జరిగిపోయింది. ఎగిసిపడుతున్న మంటలను స్థానికులు ఆర్పేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  గతంలోనూ ఈ సైకో ఆగంతకులు ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 7 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 16న పెద్దపల్లి జిల్లాలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. గ్రామంలో కనిపించిన వారినల్లా చితక బాదడంతో భరించలేని గ్రామస్తులు గ్రామపంచాయతీ వద్ద తాళ్లతో బంధించి పోలీసులకు అప్పగించారు. పెద్దపల్లి మండలం లోని చీకురాయి గ్రామానికి చెందిన నార్ల కుమార్ అనే  సైకో గ్రామంలో పలుమార్లు ఇలాగే వీరంగం సృష్టించాడు. పలుమార్లు  గ్రామస్థులు మందలించినా సైకో కుమార్ లో మార్పు రాలేదు. 

ఆ రోజు ఉదయం గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది ఇంటి ముందు ఉన్న మురికి కాలువ శుభ్రం చేస్తున్న క్రమంలో సిబ్బందినిపై దాడి చేశాడు. దీంతో అక్కడే ఉన్న గ్రామస్థులు సైకో కు దేహశుద్ది చేసి గ్రామ పంచాయితీ దగ్గర ఉన్న కుర్చీకి తాళ్లతో కట్టివేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సైకోని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

click me!