పీఆర్సీ వార్.. ప్రభుత్వ వ్యూహానికి ఉద్యోగ సంఘాల కౌంటర్, పాత జీతమే ఇవ్వాలంటూ రిక్వెస్ట్ లెటర్లు

By Siva KodatiFirst Published Jan 27, 2022, 8:42 PM IST
Highlights

రేపటిలోగా బిల్లులు ప్రాసెస్ చేసి.. ఫిబ్రవరి 1 నాటికి జీతాలు వచ్చేలాగా చూడాలని ఆదేశించింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వ ఒత్తిడికి కౌంటర్ వ్యూహం సిద్ధం చేసింది పీఆర్సీ సాధన సమితి (prc steering committee) . పెండింగ్ డీఏలతో కూడిన పాత జీతం ఇవ్వాలంటూ డీడీవోలకు రిక్వెస్ట్ లెటర్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.

కొత్త పీఆర్సీ (prc) జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు ఉద్యమిస్తున్నా ఏపీ ప్రభుత్వం (ap govt) మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఉద్యోగుల జీతాలు, ఫించన్ల బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆర్ధిక శాఖ మరోసారి ట్రెజరీ శాఖకు (ap treasury department) సర్క్యూలర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, ఫించన్ల బిల్లులు వుండాలని సూచించింది. ఈ మేరకు రేపటిలోగా బిల్లులు ప్రాసెస్ చేసి.. ఫిబ్రవరి 1 నాటికి జీతాలు వచ్చేలాగా చూడాలని ఆదేశించింది ప్రభుత్వం. 

అయితే ప్రభుత్వ ఒత్తిడికి కౌంటర్ వ్యూహం సిద్ధం చేసింది పీఆర్సీ సాధన సమితి (prc steering committee) . పెండింగ్ డీఏలతో కూడిన పాత జీతం ఇవ్వాలంటూ డీడీవోలకు రిక్వెస్ట్ లెటర్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు రిక్వెస్ట్ లెటర్ ప్రోఫార్మాను సిద్దం చేసింది పీఆర్సీ సాధన సమితి. తమకు పెండింగ్ డీఏలతో కూడిన పాత జీతం ఇవ్వాలంటూ పంచాయతీ రాజ్ శాఖ డీడీవోకు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు. ఈ లెటర్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వాన్ని సాంకేతికంగా ఇరుకున పెట్టొచ్చని భావిస్తోంది పీఆర్సీ సాధన సమితి. న్యాయ నిపుణులతో సంప్రదింపుల తర్వాత పాత జీతాలు కోరుతూ.. రిక్వెస్ట్ లెటర్ పెట్టాలని ఈ నిర్ణయం తీసుకుంది. 

అంతకుముందు పీఆర్సీ (prc) వ్యవహారానికి సంబంధించి ఏపీ సచివాలయంలో పీఆర్సీ సాధన సమితి సమావేశం  ముగిసింది. జీతాలు ప్రాసెస్ చేయకుంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై ఉద్యోగ నేతలు చర్చలు జరిపారు. అనంతరం సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి (venkatrami reddy) మీడియాతో  మాట్లాడుతూ... మొన్న లేఖ ఇచ్చి గంటన్నరపాటు చర్చించి వచ్చారని అన్నారు. చర్చలు మాకు ఇష్టం లేదన్నట్లుగా ప్రభుత్వం మాట్లాడటం సరికాదని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. 

మమ్మల్నే తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తమ డిమాండ్లు ఏంటో ఇప్పటికే చెప్పామన్నారు. ప్రభుత్వానికి తమ ప్రతినిధుల బృందం ఇప్పటికే నివేదించిందని వెంకట్రామిరెడ్డి చెప్పారు. ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. పాత జీతాలే ఇవ్వాలని తాము కోరుతున్నామన్నారు. అప్పుడే  ప్రభుత్వంపై తమకు నమ్మకం కలుగుతుందని... 3 డిమాండ్లు పరిష్కరించిన తర్వాతే చర్చలకు వస్తామని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. 

అంతకుముందు ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) సూచించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. పరిస్థితి చేజారిపోక ముందే ఉద్యోగ సంఘాల నేతలు ఈ అంశాన్ని ముగించేందుకు సహకరించాలని రామకృష్ణారెడ్డి కోరారు. చర్చలకు రమ్మని తామే కోరుతున్నామని సజ్జల తెలిపారు. 

అయినా చర్చలకు రాకుండా మొండికి వేయడం తగదని హితవు పలికారు. చర్చలకు వస్తేనే కదా? కమిటీలో చర్చిస్తేనే కదా? అసలు సమస్య ఏంటో తెలిసేది అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ కమిటీ పరిధిలో లేని అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ప్రభుత్వం నాలుగు మెట్లు దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా ఉద్యోగ సంఘాల నేతలు మొండికేయడం తగదని రామకృష్ణారెడ్డి అన్నారు. తాము చర్చల కోసం ప్రతి రోజూ సచివాలయంలో వేచి చూస్తూనే ఉంటామన్నారు.

click me!