AP Employees: ఏపీలో ఉద్యోగుల పోరుబాట.. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు

By Sumanth Kanukula  |  First Published Dec 7, 2021, 2:14 PM IST

పీఆర్సీ (PRC), పెండింగ్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఉద్యోగులు (AP Employees) నిరసన కార్యక్రమాలను ప్రారంభించారు. చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.


పీఆర్సీ (PRC), పెండింగ్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఉద్యోగులు (AP Employees) నిరసన కార్యక్రమాలను ప్రారంభించారు. చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో కూడా నిరసన తెలుపనున్నట్టుగా ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి నేతలు వెల్లడించారు.  పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ప్రకటించే వరకు నిరసన కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. 

ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కర్నూలులో మాట్లాడుతూ.. 13 లక్షల ఉద్యోగుల సమస్యలపై నేటి నుంచి ఉద్యమం ప్రారంభించినట్టుగా చెప్పారు. ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చామని అన్నారు. రెచ్చగొట్టేలా ప్రవర్తించినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టలేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగజేయవద్దనే సంయమనం పాటిస్తున్నామన్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలనే అడుగుతున్నామని.. ప్రభుత్వం మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఉద్యమం వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగితే దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉందని చెప్పారు. సీసీఎస్ రద్దు చేస్తామని గతంలో చెప్పిన వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక ఆ హామీని విష్మరించారని అన్నారు. పీఆర్సీ నివేదికను బయట పెట్టేందుకు ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. 

Latest Videos

విశాఖలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించేవరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. పీఆర్సీ అమలు సహా 71 డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని అన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

ఇక, పీఆర్సీ అమలు, డీఏ, సీపీస్ రద్దు సహా తమ డిమాండ్‌ల కోసం మంగళవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టుగా ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నిర్ణయించాయి. ఇందులో భాగంగా.. ఉద్యోగులు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్నారు. డిసెంబరు 10న మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టనున్నారు. డిసెంబర్ 13న ర్యాలీలు చేపట్టనున్నారు. డిసెంబర్ 16న అన్ని లాలుకాలు, డివిజన్‌లు, ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలు చేపట్టనున్నారు. డిసెంబర్ 21న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్టుగా  ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఆ తర్వాత డివిజన్ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా వెల్లడించాయి. 

అయితే ఈ నిరసల్లో తాము పాల్గొనడం లేదని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ ప్రకటించింది. 10 రోజుల్లో పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినందున తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించింది. అయితే మరికొన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని నిర్ణయం తీసుకునింది. 

click me!