
అమరావతి: ఉద్యోగసంఘం నేతల స్వార్థం వల్లే 14లక్షలమంది ఉద్యోగులు మోసపోయారని టిడిపి (TDP) ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు (paruchuri ashok babu) ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎవరి జేబుకైతే చిల్లుపడిందో వారే పాలకులపై ధ్వజమెత్తాలని సూచించారు. 100 గొర్రెలకు ఒకసింహం నాయకత్వం వహిస్తే యుద్ధంలో గెలుపు సాధ్యమవుతుంది... కానీ 100 సింహాలకు గొర్రె నాయకత్వం వహిస్తే ప్రయోజనం శూన్యం అంటూ ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి ఎద్దేవా చేసారు.
''వైసీపీ (YSRCP) ప్రభుత్వం తాను అనుకున్న విధంగానే పే రివర్స్ ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగుల ప్రయోజనాలు, వారివేదన పట్టించుకోకుండా పాలకులు అనుకున్న విధంగానే పీఆర్సీని 23శాతానికి తగ్గించడం ముమ్మాటికీ దుర్మార్గమే'' అని అశోక్ బాబు మండిపడ్డారు.
''గతంలో ఎన్జీవో (NGO) నాయకులు రెండుచేతులతో వైసిపికి ఓటేసి అధికారాన్ని తీసుకువచ్చాం. తాము, తమ కుటుంబసభ్యులు కలిపి 60లక్షలవరకు ఓట్లున్నాయని... కావాలంటే ప్రభుత్వాన్ని దించుతామనికూడా ఒక సందర్భంలో ప్రకటించారు. ఉద్యోగసంఘం నేతలు చూపిన విశ్వాసం గానీ, వారుచేసిన హెచ్చరికతో కూడిన భయంగానీ ఈప్రభుత్వానికి లేవని తాజాగా ప్రకటించిన జీవోలతో స్పష్టమైంది. రెండులేకుండా ప్రవర్తించేది దుర్మార్గులు మాత్రమే'' అని విమర్శించారు.
''62ఏళ్ల వయోపరిమితి పెంపునిర్ణయం సామాన్య ఉద్యోగులకు ఏమాత్రం ప్రయోజనం కలిగించేది కాదు. కేవలం కొందరు ఉద్యోగసంఘం నేతలే దానివల్ల లబ్దిపొందుతున్నారు. ఉద్యోగసంఘ నేతలు మగాళ్లైతే, వారిలో నిజంగా సత్తా, ధైర్యం ఉంటే 60ఏళ్ల వయోపరిమితి చాలని ప్రభుత్వానికి తెగేసి చెప్పాల్సింది. ఫిబ్రవరిలో రిటైరయ్యేవారు వయోపరిమితి నిర్ణయం వెలువడిన వెంటనే రాజీనామాలు చేసి సంఘాలనుంచి వైదొలిగి ఉంటే... అప్పుడు కిందిస్థాయి ఉద్యోగులు వారి మాటలు నమ్మేవారు. పీఆర్సీ వద్దు, 62ఏళ్ల వయోపరిమితి కావాలనడం ఎక్కడైనా ఉందా? 62ఏళ్లకు ఒప్పుకున్న రోజునే ఉద్యోగసంఘ నేతల నిజాయితీ మంటగలిసింది. అంతా అయిపోయాక ఇప్పుడు ప్రభుత్వం విడుదలచేసిన పీఆర్సీ జీవోలను తాము సమ్మతించం అంటే సరిపోతుందా?'' అని నిలదీసారు.
''ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీవల్ల కేవలం కొద్దిమందికి మాత్రమే లబ్ధి కలుగుతోంది. ఇప్పుడు ప్రకటించిన పీఆర్సీ అమలు కానప్పుడు 62ఏళ్ల నిబంధన కూడా అమలుకాదు. ఉద్యోగసంఘ నేతలు పీఆర్సీ నివేదికను కాకుండా అన్నింటినీ తిరస్కరించి ఉంటే బాగుండేది. వారిలో ఇంకా నిజాయితీ, ఏమాత్రం తెగువ ఉన్నా ఇప్పటికైనా ఉద్యోగులు అందరి ప్రయోజనాల గురించి ఆలోచించాలి. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు భౌతికంగా పోరాడటం మానేసి వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్ లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఉద్యోగులు కేవలం అల్ప సంతోషులు. ప్రభుత్వం ఏది ప్రకటిస్తే దానిపై ఉద్యోగ సంఘాల నేతలు సంబరాలు చేసుకుంటారా?'' అని ప్రశ్నించారు.
''ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులు తనకు గతంలో చేసిన సాయాన్ని, ఇప్పుడు ఉద్యోగ సంఘాలనేతలు చేసిన వేడుకోళ్లు, హెచ్చరికలను బేఖాతరు చేసి తాను అనుకున్నదే చేశారు. 4శ్లాబులుగా ఉన్న హెచ్ఆర్ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) ను 3శ్లాబులకు కుదించారు. వాటిలో ఒక శ్లాబ్ అసలు రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులకు వర్తించదు. ఎక్కడో ఢిల్లీలో ఏపీ తరుపున పనిచేసే 50, 60 మంది ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్రంలో ఉన్న దాదాపు 60శాతం ఉద్యోగులకు 8శాతం అన్న హెచ్ఆర్ఏ నిబంధన మాత్రమే వర్తిస్తుంది. 5ఏళ్లకు వచ్చేపీఆర్సీని కాదని పదేళ్ల పీఆర్సీని అమలుచేయడం ద్రోహమే అవుతుంది. ఇంతకంటే రాష్ట్రఉద్యోగులు కొత్తగా నష్టపోయేది ఏమీలేదు'' అని ఆందోళన వ్యక్తం చేసారు.
''4లక్షల వరకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విభాగాలు కలిపి దాదాపు 14లక్షలమంది ఉద్యోగులు ఉద్యోగసంఘ నేతల స్వార్థంతో మోసపోయారు. అలాంటప్పుడు ఉద్యోగులు వారినేం చేసినా తప్పులేదు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకోసం పోరాడినవారే ఇప్పుడు సంఘనేతలుగా ఉన్నారు. వారి అనుభవం, విజ్ఞత ఇప్పుడు ఏమయ్యాయి? 23శాతం పీఆర్సీ అన్నప్పుడే నేతలు తమకొద్దని ప్రభుత్వంతో చెప్పి ఉండాల్సింది. ప్రభుత్వం ఏదో ఒరగబెడుతుందని నమ్మి, ఉద్యమాన్ని ఆపేశారు. ఇప్పుడు ఉద్యోగులు ఎవరైనా తిరిగి సంఘనేతలతో కలిసివచ్చే పరిస్థితి ఉందా?'' అని అశోక్ బాబు ప్రశ్నించారు.