తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. పూర్తి వివరాలు ఇవే..

Published : Mar 13, 2023, 09:40 AM IST
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. పూర్తి వివరాలు ఇవే..

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 3 పట్టభద్రల, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 3 పట్టభద్రల, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.  శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం, ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు, కడప - అనంతపురం - కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి 10,00,519 మంది ఓటర్లు ఉండగా.. 1,172 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

మొత్తం 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలకు 55,842 మంది ఓటర్లు ఉండగా.. 351 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు మొత్తం 3,059 మంది ఓటర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే 5 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు తగినంత సమయం ఇచ్చామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా ఆదివారం తెలిపారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు భారత ఎన్నికల సంఘం ఆ పేర్లను తొలగించిందని చెప్పారు.

-శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గానికి 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 
- ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గానికి 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
- కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గానికి 49 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 
- శ్రీకాకుళం స్థానిక సంస్థల నియోజకవర్గానికిఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు.
- పశ్చిమగోదావరి స్థానిక సంస్థల రెండు నియోజకవర్గాలకు 6 గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. 
-కర్నూలు స్థానిక సంస్థల నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 
-ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో 8మంది బరిలో నిలిచారు.
- కడప–అనంతపురం–కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 12 మంది బరిలో ఉన్నారు.

ఇక, మొత్తం 9 స్థానిక సంస్థల అభ్యర్థులకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకాగా.. అందులో ఐదుచోట్ల కేవలం వైసీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో అనంతపురం స్థానిక సంస్థల స్థానం నుంచి ఎస్‌ మంగమ్మ, కడప స్థానిక సంస్థల స్థానం నుంచి రామసుబ్బారెడ్డి, నెల్లూరు స్థానిక సంస్థల స్థానం నుంచి మేరిగ మురళీధర్, తూర్పుగోదావరి స్థానిక సంస్థల స్థానం నుంచి కుడుపూడి సూర్యనారాయణరావు, చిత్తూరు స్థానిక సంస్థల స్థానం నుంచి నుంచి సుబ్రమణ్యం సిపాయి మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది.

తెలంగాణ విషయానికి వస్తే.. 
తెలంగాణలోమహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దాదాపు 29,720 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదయ్యారు. ఈ ఉపాధ్యాయుల నియోజకవర్గం మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, జోగులాంబ-గద్వాల్, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి మరియు హైదరాబాద్ జిల్లాల పరిధిలోకి వస్తుంది. ఈ ఎన్నిక కోసం హైదరాబాద్‌లో 22 పోలింగ్‌ కేంద్రాలతో సహా 137 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12 మంది సెక్టోరల్ అధికారులు, 29 మంది పరిశీలకులను నియమించారు. దాదాపు 739 మంది పోలింగ్ సిబ్బందిని ఎన్నికల విధుల కోసం నియమించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu