రాష్ట్రపతి ఎన్నికల తర్వాత సమీకరణలు మారిపోతాయా?

Published : May 13, 2017, 02:36 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
రాష్ట్రపతి ఎన్నికల తర్వాత సమీకరణలు మారిపోతాయా?

సారాంశం

మారుతాయనుకుంటున్నసమీకరణల్లో మిత్రపక్షాలు విడిపోయేందుకు అవకాశాలున్నాయి. ఎన్డీఏలోకి కొత్తగా వైసీపీ చేరవచ్చు. జగన్ ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఇందుకు సూచనప్రాయంగా సంకేతాలు అందుతున్నాయి.

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశాలున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన జరగబోయే మార్పులకు సంకేతాలుగా కనబడుతున్నాయ్. సరికొత్త సమీకరణలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నిమార్చేసినా ఆశ్చర్యపడక్కర్లేదని సమాచారం. ప్రస్తుతం టిడిపి-భాజపాలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఒంటరి పోరాటం చేస్తోంది. జనసేన వ్యవహారంలో స్పష్టత లేదు. ఇక, వామపక్షాలు, కాంగ్రెస్ గురించి ఇపుడే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.

మారుతాయనుకుంటున్నసమీకరణల్లో మిత్రపక్షాలు విడిపోయేందుకు అవకాశాలున్నాయి. ఎన్డీఏలోకి కొత్తగా వైసీపీ చేరవచ్చు. జగన్ ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఇందుకు సూచనప్రాయంగా సంకేతాలు అందుతున్నాయి. ప్రధాని, జగన్ భేటిపై టిడిపి నేతలు విరుచుకుపడినపుడు జగన్ కు మద్దతుగా భాజపా నేతలు టిడిపిపై ఎదురుదాడి చేయటమే భవిష్యత్ సంకేతాలనుకోవచ్చు.

ఒకవేళ జగన్ గనుక ఎన్డీఏలో చేరితే చంద్రబాబునాయుడు పరిస్ధితి ఏమటన్నది పెద్ద ప్రశ్న. ఎన్డీఏలో నుండి వైదొలగితే రాబోయే సమస్యలను అంచనా వేయలేనంత అమాయకుడు కాదు చంద్రబాబు. అందుకే రాష్ట్రప్రయోజనాల విషయంలో కేంద్రం పెద్దగా సహకరించకపోయినా మాట్లాడకుండా సర్దుకుపోతున్నారు.

ఒకవేళ వైసీపీ గనుక ఎన్డీఏతో జతకట్టడం ఖాయమైతే అపుడు చంద్రబాబుకు కష్టాలు మొదలైనట్లే. చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఎన్డీఏలో ఉండలేరు. ఎన్డీఏలోకి జగన్ అడుగుపెట్టటమంటే చంద్రబాబు బయటకు రావటమే. చంద్రబాబు బయటకు వచ్చేస్తే ఎదురవ్వబోయే సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలో ఈ పాటికే ఆలోచించుకునే ఉంటారనటంలో ఎవరికీ సందేహాలు అవసరం లేదు. అయితే, అది ఎప్పుడు, ఎలా జరుగుతుందన్నదే ప్రశ్న. 

ఇక, వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిపోరాటం చేస్తుందంటూ పవన్ కల్యాణ్  ప్రకటించారు. అయితే, వామపక్షాలతో రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నారు. దాంతో అందరిలోనూ పలు అనుమానాలు తొంగి చూస్తున్నాయి. వామపక్షాల విషయం చూస్తే తామెవరితో పొత్తుపెట్టుకోవాలో నిర్ణయించే స్ధితిలో లేరు. వైసీపీ, జనసేన ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకోకుండా మనుగడ సాగించటం కష్టమే. కాంగ్రెస్ గురించి ఇపుడే ఎవరూ ఆలోచించటం లేదు.                                                                                                                                                       

వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరు చేయాలని భాజపా స్ధానిక నేతలు జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. మూడేళ్ళ చంద్రబాబు పాలనపై జనాల్లో వ్యతిరేకత ప్రబలుతోందని నివేదికలు కూడా ఢిల్లీకి అందచేస్తున్నారు. పైగా చంద్రబాబుపై అవినీతి ఆరోపణలూ పెరిగిపోతోందంటున్నారు. ఈ కారణాలను సాకుగా చూపించి చంద్రబాబు తనంతట తానుగా ఎన్డీఏని వదిలేసే పరిస్ధితులు సృష్టించే అవకాశాలే ఎక్కువ. జగన్ కు భాజపా నేతలు మద్దతుగా మాట్లాడటం  అందుకు సంకేతాలే కావచ్చు.

 

 

 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?