కందుకూరు ఘటనలో దర్యాప్తు ముమ్మరం... ఎఫ్ఐఆర్ నమోదు, ఘటనాస్థలిని పరిశీలించిన డీఐజీ

By Siva KodatiFirst Published Dec 29, 2022, 3:19 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరులో నిర్వహించిన రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై పొలీస్ శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించిన ఘటన జాతీయ స్థాయిలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీస్ శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా సెక్షన్ 174 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. గురువారం ఘటన జరిగిన ప్రదేశాన్ని నెల్లూరు ఎస్పీ, గుంటూరు రేంజ్ డీఐజీలు పరిశీలించారు. 

ఇక, వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనురిస్తుందని ఆరోపిస్తున్న టీడీపీ.. అందుకు నిరసనగా ‘ఇదేమి కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం కందకూరులో రోడ్ షో నిర్వహించారు. సాయంత్రం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. సభా వేదిక వద్ద ప్రజలు పెద్దఎత్తున గుమిగూడటం.. సభ జరుగుతున్న సమయంలో ప్రజల్లో కొంత తోపులాటలు చోటుచేసుకుంది. చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ప్రారంభించగానే.. తొక్కిసలాట చోటుచేసుకుని కొందరు వ్యక్తులు సమీపంలోని కాలువలో పడిపోయారు. వెంటనే సభను ఆపేసిన టీడీపీ నేతలు బాధితులను ఆస్పత్రికి తరలించారు. కొంత మంది గాయాలతో మృతి చెందగా, మరికొందరు ఊపిరాడక మృతి చెందారు. 

ALso REad: కందుకూరు ఘటనలో మరణించినవారి కుటుంబాలకు సీఎం జగన్ సానుభూతి.. మృతుల కుటుంబాలకు పరిహారం..

చంద్రబాబు నాయుడుకు కూడా సభను నిలిపివేసి.. ఆస్పత్రి వద్దకు బాధితులను పరామర్శించారు. అనంతరం తిరిగి బహిరంగ సభ వద్దకు చేరుకున్న చంద్రబాబు నాయుడు..జరిగిన పరిణామాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ సమావేశంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి అని అన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాల్లో చదవుకునేవారుంటే.. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా చదివిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలందరూ మృతుల కుటుంబాలకు అండగా ఉండి.. అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. చనిపోయిన వారికి సంతాపం  ప్రకటిస్తూ.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఇక, చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటనపై కందుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన చేసింది. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాన్ కూడా స్పందించారు. కందుకూరులో టీడీపీ సభ జరుగుతుండగా చోటుచేసుకన్న తొక్కిసలాటలో 8 మంది మృతిచెందడం, మరికొందరు ఆస్పత్రి పాలవడం చాలా దురదృష్టకరమని పవన్ అన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను అని.. అటువంటి కార్యకర్తలు ఇలా ప్రమాదం బారినపడి మృతిచెందడం ఎంతో విచారకరమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

click me!