
అమరావతి : ఎవరయినా ఆకతాయిలు వేధిస్తుంటే అమ్మాయిలు పోలీసులను ఆశ్రయిస్తుంటారు. కానీ ఓ పోలీసే ఆకతాయిలా మారి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ కీచక పోలీస్ వేధింపులు భరించలేక చివరకు వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీస్ వ్యవస్థకే మచ్చతెచ్చే ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా కంబదూర్ మండలానికి చెందిన ఓ వివాహిత యువకుడి చేతిలో మోసపోయింది. దీంతో యువకుడిపై ఫిర్యాదు చేసేందుకు ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఈ క్రమంలో హోంగార్డ్ శివానందం కన్ను వివాహితపై పడింది. న్యాయం జరిగేలా చూస్తానంటూ మాయమాటలు చెప్పి వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడినపోయిన వివాహిత వెంటనే ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు విషయం చెప్పింది.
Read More భార్యపై అనుమానంతో..వేడివేడినీరు మొహం మీద కొట్టిన భర్త...
తనతో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డ్ పై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదుచేసింది వివాహిత. కానీ అతడిపై పోలీస్ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తనతో తప్పుగా ప్రవర్తించిన హోంగార్డును పోలీస్ ఉన్నతాధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వివాహితకు అర్థమయ్యింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయిన ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడివున్న వివాహితను గమనించిన కుటుంబసభ్యులు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమయానికి వైద్యం అందడంతో వివాహితకు ప్రాణాపాయం తప్పింది.
వివాహిత ఆత్మహత్యాయత్నం తర్వాత వెంటనే స్పందించిన అనంతపురం ఎస్పీ హోంగార్డ్ పై చర్యలు తీసుకున్నారు. వెంటనే శివానందంను సస్పెండ్ చేస్తున్నట్లు పోలీస్ అధికారులు మంగళవారం ప్రకటించారు.