తిరుపతి జిల్లాలో జల్లికట్టు పోటీల నిర్వాహకులకు పోలీసుల షాక్.. కేసులు నమోదు..

By Sumanth KanukulaFirst Published Jan 19, 2023, 8:59 AM IST
Highlights

సంక్రాంతి పండగ సందర్భంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఏ రంగంపేట, తదితర గ్రామాల్లో జల్లికట్టు పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. 

సంక్రాంతి పండగ సందర్భంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఏ రంగంపేట, తదితర గ్రామాల్లో జల్లికట్టు పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. జల్లికట్టు నిర్వాహణపై పోలీసులు ఆంక్షలు ఉన్నప్పటికీ.. నిర్వాహకులు వాటిని లెక్కచేయకుండా నిర్వాహకులు, స్థానికులు జల్లికట్టు పోటీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే జల్లికట్టు నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏ రంగంపేటో జల్లికట్టు నిర్వాహించిన 10 మందిపై కేను నమోదైంది. ఇక, జిల్లాలో మొత్తం 31 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇక, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్థానికంగా పశువుల పండుగగా పిలుచుకునే జల్లికట్టు తరహా పోటీలకు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. కనుమ పండగ సందర్భంగా రంగంపేటలో నిర్వహించిన జల్లికట్టు పోటీలను చూసేందుకు పొరుగు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. జల్లికట్టు పోటీలో పాలుపంచుకున్న యువత.. ఇరుకైన దారిలోకి వదిలిన పశువుల కొమ్ములకు కట్టిన పలకలను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 10 మంది యువకులు గాయపడ్డారు.

జల్లికట్టు పోటీలకు కొన్ని రోజుల ముందే పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. జల్లికట్టు సహా ఆ రకమైన క్రీడల నిర్వహణకు ఎటువంటి అనుమతి లేదని పోలీసుల ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నిర్వహించే జల్లికట్టుపై పూర్తిగా నిషేధం ఉందని అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాశ్ స్పష్టం చేశారు. డబ్బుల కోసం జల్లికట్టు, పేకాట, గుండాట వంటివి నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే నిర్వాహకులు మాత్రం లెక్కచేయలేదు. రాజకీయ ఒత్తిళ్ల మధ్య, ఇతర కారణాలతో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. 

click me!