శ్రీవారే తన భక్తురాలిని కాపాడుకోడానికి వచ్చాడా అన్నట్లుగా కడప డిటిసి కి చెందిన స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ అర్షద్ అక్కడకు చేరుకున్నాడు
తిరుమల: కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి దర్శనంకోసం వెళుతూ అస్వస్థతకు గురయి అసహాయ స్థితిలో వున్న భక్తురాలిని కాపాడి సాయానికి కులం మతం వుండదని చాటిచెప్పాడు కానిస్టేబుల్ అర్షద్. శ్రీవారి భక్తురాలిని ఏకంగా ఆరు కిలోమీటర్లు మోసుకు వెళ్లి కాపాడాడు. ఇలా కులమతాలను పట్టించుకోకుండా మహిళ ప్రాణాలను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నాడు అర్షద్.
వివరాల్లోకి వెళితే... మంగి నాగేశ్వరమ్మ(68)అనే మహిళ పాదయాత్రగా తిరుమల కొండపైకి వెళుతూ సొమ్మసిల్లి పడిపోయింది. అటవీ ప్రాంతం కావడం, వాహనాలను తీసుకువెళ్లే అవకాశం లేకపోవడంతో చాలాసేపు ఆమె అలాగే పడిపోయివుంది. ఇలాగే మరికొద్దిసేపు వుంటే ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారేలా వుండటంతో అందరూ ఆందోళనకు గురయ్యారు.
undefined
ఇదే సమయంలో ఆ శ్రీవారే తన భక్తురాలిని కాపాడుకోడానికి వచ్చాడా అన్నట్లుగా కడప డిటిసి కి చెందిన స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ అర్షద్ అక్కడకు చేరుకున్నాడు. మంగమ్మను తన వీపుపైకి ఎక్కించుకుని దాదాపు ఆరు కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లి వాహనంలోకి చేర్చాడు. అక్కడి నుండి మహిళను దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో మహిళ ప్రాణాలు దక్కాయి.
ఇలా శ్రీవారి భక్తురాలికి తానే వాహనమై ప్రజల పట్ల పోలీసులకు ఉన్న భాధ్యతను చాటుకున్నాడు కానిస్టేబుల్ అర్షద్. ఇలా ఓ మహిళ ప్రాణాలను కాపాడిన అర్షద్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ తో పాటు ఉన్నతాధికారులు కూడా అతడిని అభినందిస్తున్నారు.