
గుడివాడ: ఇటీవల గుడివాడ మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ అరవింద్‌పై మైనింగ్ మాపియా దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గుడివాడ మండలం మోటూరులో అర్థరాత్రి మట్టి తవ్వకాలు చేపడుతుంటే అడ్డుకోడానికి ప్రయత్నించిన ఆర్ఐ పై కొందరు జేసిబితో దాడికి పాల్పడుతున్న వీడియోలు బయటకువచ్చింది. ఇలా తనపై జరిగిన దాడిపై ఆర్ఐ పోలీసులకు ఫిర్యాదు చేయగా 10 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో కొత్తగా మరో మలుపు తిరిగింది. ఆర్ఐ తమను లంచం డిమాండ్ చేసారని మట్టి తవ్వకాలు చేపట్టినవారు పిర్యాదు చేయడంతో పోలీసులు రెవెన్యూ సిబ్బందిపైనా కేసులు నమోదు చేసారు.
ఇలా మైనింగ్ మాఫియా బాధితుడైన ఆర్ఐ అరవింద్, అతడి సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఖండిస్తోంది. మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాల్సింది పోయి అక్రమాలను అడ్డుకోడానికి ప్రయత్నించిన ప్రభుత్వ అధికారిపై కేసు నమోదు చేయడాన్ని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తప్పుబట్టారు. ఈ మేరకు మైనింగ్ మాఫియాపై మరింత కఠినంగా వ్యవహరించాలని... గుడివాడ ఆర్ఐ పై కేసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ రాష్ట్ర డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి వర్ల రామయ్య లేఖ రాసారు.
''గుడివాడ ఆర్ఐ అరవింద్ పై మైనింగ్ మాఫియా హత్యాయత్నం చేసిన విషయం మీకు తెలిసిందే. ఇలా రాష్ట్రంలో రోజురోజుకూ మరింత రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నేను గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సైతం లేఖ రాయడం జరిగింది. అయితే ఆశ్చర్యకరంగా బాధితుడైన ఆర్ఐ పైనే మైనింగ్ మాఫియాను లంచం అడిగాడంటూ ఈనెల 24న పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది చాలా దారుణం'' అని వర్ల పేర్కొన్నారు.
''అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారిపైనే కేసు నమోదు చేశారంటే మైనింగ్ మాఫియా ఎంత శక్తివంతంగా ఉందో తెలుస్తోంది. అరవింద్ పై మైనింగ్ మాఫియా దాడికి సంబంధించి గుడివాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబడి విచారణ కొనసాగుతున్నది. అలాంటిది అక్రమ మైనింగ్ కు పాల్పడి, రెవెన్యూ అధికారిపై దాడి చేసిన మాఫియాను అరెస్టు చేయకుండా బాధితుడైన ఆర్ఐపై కేసు నమోదు చేయడం దుర్మార్గం'' అన్నారు.
''హింస, దాడులు, వేధింపులకు ప్రజాస్వామ్యంలో తావులేదు. వైసీపీ దాడుల నుంచి అధికారులను కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. బాధితుడిపై పోలీసులు కేసు నమోదు చేయడం అంటే ప్రజల్లో పోలీసులపై నమ్మకం సన్నగిల్లేట్లు చేయడమే. బాధితులను, నిస్సహాయులను కాపాడటం పోలీసుల ప్రాధమిక విధి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చాప్టర్ 12, సెక్షన్ 154 నుంచి 176 వరకు పోలీసులు నిస్పక్షపాత విచారణ చేసి బాధితులను కాపాడే అధికారాలు ఇవ్వబడ్డాయి. కానీ దీనికి విరుద్దంగా గుడివాడ పోలీసులు బాధితుడిపైన కేసు నమోదు చేయడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది'' అని వర్ల అన్నారు.
''పోలీసుల్లో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మొత్తం పోలీస్ వ్యవస్థను నాశనం చేసేలా క్రిమినల్స్ ను కాపాడుతున్నారు.జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం, రెవెన్యూ అధికారుల సంఘం, గనుల శాఖ అదికారులు దీనిపై మౌన వహించడంపై కారణాలు వారికే తెలియాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసుపై మీరు దృష్టి పెట్టి క్రిమినల్స్ ను కాపాడుతూ బాధితుడిపై కేసు నమోదు చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోండి. అక్రమ మైనింగ్ కేసుపై పర్యవేక్షణ కోసం ఒక సీనియర్ అధికారిని నియమించండి. బాధితుడైన రెవెన్యూ ఇన్స్ పెక్టర్ అరవింద్ కు న్యాయం జరిగేలా చూడండి'' అని లేఖ ద్వారా డిజిపిని కోరారు వర్ల రామయ్య.