
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓ రాజేంద్రకుమార్‌జైన్ అభిప్రాయపడ్డారు.
గురువారం నాడు విజయవాడలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశ వివరాలను రాజేంద్రకుమార్ జైన్ మీడియాకు వివరించారు. 2022 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.
కాఫర్ డ్యామ్ రక్షణ పనులు, వరద అంచనా వ్యవస్థలపై ఈ సమావేశంలో చ ర్చించామన్నారు. ప్రస్తుతం కాఫర్ డ్యామ్ పని పాక్షికంగానే పూర్తైందన్నారు. వరదలు రాకముందే పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు నిర్వహిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.
ఈ సారి పోలవరం డ్యామ్‌కు 10వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ వరద వల్ల కాఫర్ డ్యామ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇప్పటివరకు రూ.6700 కోట్లు విడుదల చేసిందన్నారు.
శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్టు పనులను పీపీఏ సభ్యులు పరిశీలిస్తారని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను పెంచే విషయం ఎస్టిమేషన్ కమిటీ పరిశీలిస్తోందని రాజేంద్రకుమార్ చెప్పారు.