సవరించిన అంచనా: జగన్ ప్రభుత్వానికి పోలవరం అథారిటీ చల్లని కబురు

By telugu teamFirst Published Nov 22, 2020, 8:20 AM IST
Highlights

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆ ప్రాజెక్టు అథారిటీ వైఎస్ జగన్ ప్రభుత్వానికి అనుకూలమైన నిర్ణయం తీసుకుంది. సవరించిన అంచనాల ప్రకారం నిధులు ఇవ్వాలని కేంద్రానికి సూచించింది.

అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆ ప్రాజెక్టు అథారిటీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చల్లటి కబురు చేరవేసింది. పోలవరం ప్రాజెక్టు నీటి పారుదల పనులకు అయ్యే రూ.20,398.61 కోట్ల వ్యయాన్ని భరిస్తామనే కేంద్ర ఆర్థిక శాఖ షరతుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదం తెలిపింది. అదే సమయంలో ప్రాజెక్టు పూర్తి కావాలంటే అంచనాల సవరణ కమిటీ (ఆర్సీసీ) చెప్పినట్లుగా రూ.47.725.74 కోట్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. 

ప్రాజెక్టు నిర్మాణానికి పాత, కొత్త వ్యయాలతో రూపొందించిన అంచనాలను అన్నింటినీ అథారిటీ పరిగణనలోకి తీసుకుంది. పోలవరం ప్రాజెక్టులో మంచినీటి సరఫరా వ్యయాన్ని సాగు నీటి వ్యయంలో భాగంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కోరుతోందని, దానిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 

పాత, కొత్త ధరలను ఆమోదిస్తూ అథారిటీ చేసిన ఈ సిఫార్సులను కేంద్ర, జలశక్తి మంత్రిత్వ శాఖ, ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ ఎంతవరకు ఆమోదిస్తాయనే విషయంపై ప్రాజెక్టుకు వచ్చే నిధులు ఆధారపడి ఉంటాయి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చే నిధులపై గత కొంత కాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

ప్రాజెక్టులో 2013-14 ధరలతో విద్యుత్తు విభాగం కింద, మంచి నీటి విభాగం కింద అయ్యే వ్యవయాన్ని మినహాయించి కేవలం సాగునీటి కింద అయ్యే రూ.20.398.61 కోట్ల అంచనా వ్యయాన్ని మాత్మరే ఆమోదించి పంపాలని కేంద్ర ఆర్థిక శాఖ జలశక్తి శాఖకు లేఖ రాసింది. దాన్నే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదించి పంపించాలని సూచించింది. 

దానిపై చర్చించేందుకు పోలవరం అథారిటీ సర్వసభ్య సమావేశం నవంబర్ 2వ తేదీన హైదరాబాదులో జరిగింది. తాజా అంచనాల ప్రకారం కొత్త ధరలు ఎందుకు ఇవ్వాలో ఏపీ జలవనరుల శాఖ తరఫున సమావేశంలో పాల్గొన్న అధికారులు ఆ సమావేశంలో వివరించారు. ప్రాజెక్టు వ్యయమంతా భరిస్తానని కేంద్రం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మినిట్స్ ప్రతిపాదనలో మెలిక ఉండడతో ఏపీ జల వనరుల శాఖ అభ్యంతరం వ్యక్తం చేశారు దాంతో తుది మినిట్స్ ఖరారు చేశారు. దాంతో ప్రభుత్వానికి సానుకూల పరిస్థితి ఏర్పడింది. 

click me!