
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాని మోదీ పలు అంశాలను ప్రస్తావిస్తుంటారు. నేడు (మే 29) 89వ ఎపిసోడ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాం భూపాల్ రెడ్డి అభినందించారు. రాం భూపాల్ రెడ్డి అతని పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన వచ్చిన మొత్తం ఆదాయాన్ని బాలికల విద్య కోసం ఖర్చు చేయడాన్ని మోదీ ప్రశంసించారు. సుకన్య సమృద్ధి యోజన కింద రామ్‌భూపాల్‌రెడ్డి దాదాపు 100 మంది బాలికలకు ఖాతాలు తెరిచి.. వారి ఖాతాల్లో 25 లక్షలకు పైగా జమ చేశారని ప్రధాని మోదీ చెప్పారు.
‘‘స్వలాభం కోసం కాకుండా సమాజ హితం కోసం పని చేయటం మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న లక్షణం. మన దేశంలో ఎంతో మంది ఈ సూత్రాన్ని తమ జీవిత లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారి జీవన ధర్మంగా మార్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో ఉంటున్న రామ్‌భూపాల్‌రెడ్డి అనే స్నేహితుడు గురించి తెలుసుకున్నాను. రాంభూపాల్‌రెడ్డి పదవీ విరమణ తర్వాత వచ్చిన ఆదాయం మొత్తం బాలికల చదువుల కోసం విరాళంగా ఇచ్చారు. సుకన్య సమృద్ధి యోజన కింద దాదాపు 100 మంది బాలికల కోసం ఖాతాలు తెరిచి అందులో 25 లక్షలకు పైగా జమ చేశారు’’ అని ప్రధాని మోదీ అన్నారు.
కొంతమంది వ్యక్తుల దాతృత్వ విరాళాలు భారతీయ సమాజంలోని విలువలను ప్రతిబింబించడంతో పాటు ఇతరులను ప్రజా సంక్షేమంలో నిమగ్నమయ్యేలా ప్రేరేపించి, ప్రోత్సహిస్తున్నాయని ప్రధాన మంత్రి మోదీ అన్నారు.
రాం భూపాల్‌రెడ్డి గురించి..
రాం భూపాల్‌రెడ్డి రిటైర్డ్ స్కూల్ హెడ్ మాస్టర్. ఆయన పదవీ విరమణ ప్రయోజనాలను ఇల్లు కట్టుకోవడానికి లేదా సౌకర్యవంతమైన జీవనశైలికి ఉపయోగించుకోలేదు. చదువుకునే ‘సుకన్య సమృద్ధి యోజన’ కింద స్కాలర్‌షిప్‌లు పొందేలా చూశారు. 10 ఏళ్లు నిండిన 88 మంది బాలికలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరిచేందుకు యడవల్లి పోస్టాఫీసులో తన బెనిఫిట్‌ల నుంచి రూ. 25.71 లక్షలు జమ చేశారు. వారికి రూ. 41,000 వడ్డీ మొత్తం సమానంగా పంపిణీ చేయబడుతుంది. ఆ మొత్తం బాలికలకు 21 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి 88 ఖాతాలలో జమ చేయబడుతుంది.
ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు కూడా తాను పనిచేసిన గ్రామాల్లో పలు సంక్షేమ కార్యక్రమాలకు రాం భూపాల్‌రెడ్డి సేవలను అందించారు. కర్నూలు జిల్లా ఉపాధ్యాయ సంఘం నాయకుడిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన సమయంలో.. ఉపాధ్యాయులకు వారి సబ్జెక్ట్‌లలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి వర్క్‌షాప్‌లు, సమావేశాలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో వారి సమస్యలను పరిష్కరించడంలో కూడా సహాయం చేశారు. విద్యకు రామ్ భూపాల్ రెడ్డి చేసిన కృషికి గానూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమంత్రులుగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి నుంచి అవార్డులను అందుకున్నారు.