వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు దక్కని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన పుట్టిన రోజును పురస్కరించుకొని తన అనుచరులకు విందు ఏర్పాటు చేశారు.
కాకినాడ: పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు బల ప్రదర్శనకు సిద్దమయ్యారు. ఈ నెల 12న తన పుట్టినరోజును పురస్కరించుకొని తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తన నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి అనుచరులు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి ఎంపీ వంగా గీతను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపాలని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ) నిర్ణయించింది. దీంతో పిఠాపురం ఎమ్మెల్యే వైఎస్ఆర్‌సీపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. పెండెం దొరబాబు ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం కూడ సాగుతుంది. హైద్రాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పెండెం దొరబాబు కలిసినట్టుగా కూడ ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని దొరబాబు తోసిపుచ్చారు.
undefined
పిఠాపురం నుండి వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు ఇచ్చే పరిస్థితి లేదని ఆ పార్టీ నాయకత్వం తేల్చి చెప్పింది. దీంతో తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 12న పెండెం దొరబాబు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో దొరబాబు తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు ఇవ్వకపోయినా పార్టీలోనే కొనసాగుతారా ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటారా అనేది రేపు తేలనుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.
పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానులు, పార్టీ శ్రేణులకు విందు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని పైకి చెబుతున్నారు. కానీ, పార్టీ టిక్కెట్టు రాకపోవడంతో భవిష్యత్తు కార్యాచరణపై రేపటి సమావేశంలో దొరబాబు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.