లొంగిపోవాలి, లేదంటే మార్కులు వేయం: రుయా వైద్యులపై పిజీ విద్యార్థిని

Published : May 06, 2018, 11:25 AM IST
లొంగిపోవాలి, లేదంటే మార్కులు వేయం: రుయా వైద్యులపై పిజీ విద్యార్థిని

సారాంశం

తిరుపతి రుయా ఆస్పత్రిలోని పిల్లల ఆస్పత్రిలో వైద్యుల తీరుపై ఓ పీజీ విద్యార్థిని గవర్నర్ నరసింహన్ కు రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది.

తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రిలోని పిల్లల ఆస్పత్రిలో వైద్యుల తీరుపై ఓ పీజీ విద్యార్థిని గవర్నర్ నరసింహన్ కు రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. తమకు లొంగిపోవాల్సిందేనని, లేదంటే ప్రాక్టికల్స్ లో మార్కులు వేయబోమని, తమను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించింది. 

తమ వస్త్రధారణపై, శరీర సౌష్టవంపై వైద్యులు వ్యాఖ్యలు చేస్తున్నారని, తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించింది. తాను వివాహితనని, తన పట్ల ముగ్గురు అసభ్యంగా ప్రవర్తించారని అంటూ ఆమె వారి ముగ్గురు పేర్లను కూడా వెల్లడించింది. 

వేధింపులను తట్టుకోలేక, ఎదిరించలేక తాము నలిగిపోతున్నామని, చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. 

మెయిల్ ద్వారా గవర్నర్ కు ఆ లేఖ అందింది. ఆ ఆరోపణలపై వెంటనే విచారణ చేపట్టాలని గవర్నర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వీసికి, ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కు ఆదేశాలు జారీ చేశారు. ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎన్వీ రమణయ్య దీంతో అప్రమత్తమై విచారణ చేపట్టారు. 

కాగా, విచారణ సందర్భంగా గవర్నర్ కు ఫిర్యాదు చేసిన విద్యార్థినిపై ఒత్తిడి తెచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. ఎవరో ఒత్తిడి చేయడం వల్ల పొరపాటున తాను ఫిర్యాదు చేశానని ఆమెతో లిఖితపూర్వకంగా రాయించుకున్నట్లు కూడా చెబుతున్నారు. 

ప్రొఫెసర్లు కఠినంగా వ్యవహరించడం వల్ల ఈ విధమైన ఫిర్యాదు వచ్చి ఉంటుందని, ఆ విద్యార్థిని భవిష్యత్తు దృష్ట్యా ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని నిర్ణయించుకున్నామని ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చారు. అయితే, రాష్ట్ర ప్రభత్వం ఆ ఫిర్యాదుపై విజిలెన్స్ విచారణ జరిపించినట్లు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Minister Gottipati Ravi Kumar: వైసీపీ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ | Asianet News Telugu