
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడతారని.. జనం నవ్వుకుంటారనే ఆలోచన కూడా ఆయనకు లేదని విమర్శించారు. సీఎం జగన్‌పై బురద జల్లడమే పవన్ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కిరాయి తీసుకున్నాడని.. చంద్రబాబుకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 1962, 1969లలో తెలంగాణ ఉద్యమం జరిగిందని.. మరి అప్పుడు ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారని.. అంతకంటే ముందే 2001లోనే కేసీఆర్ పార్టీ పెట్టారని అన్నారు.
పవన్ ముఖ్యమంత్రి అవుతానని అంటున్నాడని.. మరి ఆయన పార్టీ 175 చోట్ల పోటీ చేస్తుందా? అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు చేయవద్దని అన్నారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. దమ్ముంటే.. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని పవన్ చెప్పాలని సవాలు విసిరారు. ఎన్నికల వరకు ముసుగు ఎందుకని ప్రశ్నించారు.
చంద్రబాబు ఓ 30 చోట్ల టీడీపీ ఇంచార్జ్‌లను పెట్టడని.. అటువంటి చోట్లే పవన్ టికెట్లు ప్రకటించి, కొన్ని చోట్లనే ప్రచారం చేస్తారని చెపుకొచ్చారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేందుకు పనిచేస్తున్నట్టుగా పవన్ చెబితే అందులో తప్పేమి లేదని అన్నారు. వైసీపీపై విషం చెప్పడమే పవన్ లక్ష్యం అని విమర్శించారు.
సినిమా గ్లామర్ ను అడ్డం పెట్టుకుని ప్రజలను అమ్మేస్తున్నావని దుయ్యబట్టారు. వైసీపీ నుంచి ఎవరినీ పార్టీలోకి రానివ్వనని చెప్పిన పవన్.. ఇప్పుడు ఎవరెవరు వస్తారా అని ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు. పవన్ వి నిలకడలేని రాజకీయాలని ఎద్దేవా చేశారు. కేంద్రం సహకారంతో జగన్‌ను ఆటాడించే శక్తి ఉంటే... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు.